తన తండ్రి కేసీఆర్ పట్ల వ్యక్తిగతంగా తనకు ఎంతో గౌరవం ఉందని ఆయనతో ఎలాంటి సమస్యలు లేవన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో మాత్రమే రాజకీయంగా ఆయన విధానాలతో విభేదిస్తున్నట్లు ఆమె కుండబద్దలు కొట్టారు.
కేసీఆర్ తన తండ్రి అని, ఒక హిందువుగా ప్రతిరోజూ తన తల్లిదండ్రుల క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తానని కవిత ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. కేసీఆర్ లేకపోతే అసలు నేను లేను అంటూనే, రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి స్పష్టమైన విభజన రేఖ గీశారు. నాకు నా తండ్రి కేసీఆర్‌తో ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ బీఆర్ఎస్ వ్యవస్థాపకుడిగా ఉన్న కేసీఆర్ విధానాలతోనే నాకు సమస్య అని ఆమె వ్యాఖ్యానించారు. తండ్రిపై మమకారాన్ని, రాజకీయ సిద్ధాంతాలను వేరు చేసి చూడాలని ఆమె తేల్చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐడియాలజీకి తాను పూర్తిగా వ్యతిరేకమని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయడం, తెలంగాణ సెంటిమెంట్‌ను పక్కన పెట్టడం వంటి నిర్ణయాలపై ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తాను తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించానని, తన పోరాటం కేవలం సిద్ధాంతాల పరంగానే ఉంటుందని ఆమె విడమర్చి చెప్పారు.
తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, ఇది కేవలం రాజకీయ చైతన్యంతో తీసుకున్న నిర్ణయమని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఆకాంక్షలను కాపాడటమే తన లక్ష్యమని, అందుకోసమే తండ్రి పెట్టిన పార్టీని కాదని సొంతంగా రంగంలోకి దిగానని తెలిపారు. కవిత రాజకీయాలు, కుటుంబానికి మధ్య స్పష్టమైన గీత గీసుకున్నారు. కానీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం అలా భావించడం లేదు.
