హైదరాబాద్ మహానగర ఆకాశహర్మ్యాల రూపురేఖలు మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం బహుళ అంతస్తుల భవనాలకే పరిమితమైన నగరం, ఇప్పుడు అత్యాధునిక ఆర్కిటెక్చర్ వింతలకు వేదికవుతోంది. ముఖ్యంగా గగనతలాన్ని తాకేలా నిర్మిస్తున్న టవర్ల మధ్య స్కై బ్రిడ్జ్ సంస్కృతి కొత్త ట్రెండ్‌గా మారింది. కేవలం విదేశీ నగరాల్లోనే కనిపించే ఈ అద్భుత దృశ్యాలు ఇప్పుడు మన ఐటీ కారిడార్‌లో సాక్షాత్కరిస్తూ, నగర వాసులను ,ఐటీ నిపుణులను ఆకట్టుకుంటున్నాయి.
సాధారణంగా రెండు వేర్వేరు టవర్లను భూమిపై కాకుండా, గాలిలో వందల అడుగుల ఎత్తున అనుసంధానించడమే ఈ స్కై బ్రిడ్జ్ ప్రత్యేకత. 19వ అంతస్తు లేదా అంతకంటే పైస్థాయిలో నిర్మితమవుతున్న ఈ వంతెనలు కేవలం రాకపోకలకు మాత్రమే కాకుండా, విలాసవంతమైన వసతులకు చిరునామాగా మారుతున్నాయి. ఈ స్కై బ్రిడ్జ్లపై స్విమ్మింగ్ పూల్స్, జిమ్నాసియంలు, ఓపెన్ ఎయిర్ లాంజ్‌లను ఏర్పాటు చేస్తూ డెవలపర్లు సరికొత్త జీవనశైలిని పరిచయం చేస్తున్నారు. భవనాల మధ్య గాలిలో నడుస్తున్న అనుభూతిని అందించడం వీటి ప్రధాన ఉద్దేశం.
నగరంలో భూమి ధరలు ఆకాశాన్ని తాకడం , స్థలం కొరత ఏర్పడటంతో, డెవలపర్లు వర్టికల్ డెవలప్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో టవర్ల మధ్య కనెక్టివిటీని పెంచడానికి మరియు భవనాలకు ఒక ఐకానిక్ లుక్ ఇవ్వడానికి ఈ స్కై బ్రిడ్జ్ సాంకేతికతను వాడుతున్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలక ప్రాంతాల్లో వస్తున్న కొత్త ప్రాజెక్టులు ఈ తరహా ఆర్కిటెక్చర్ డిజైన్లతో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటున్నాయి. ఇది భవనాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడమే కాకుండా, ఆయా ప్రాజెక్టుల విలువను కూడా అమాంతం పెంచుతోంది.
ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన నిపుణులు ఇటువంటి అత్యాధునిక , వినూత్నమైన నివాస ప్రాంతాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. భద్రత , సౌకర్యాలతో పాటు, ఆకాశంలో తేలియాడే వంతెనలపై నుండి నగరం నలుమూలలా కనిపించే స్కైలైన్ వీక్షణలు కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో మరిన్ని స్కై స్క్రాపర్లు ఇటువంటి అద్భుతమైన ఆకాశ వంతెనలతో రూపుదిద్దుకోనున్నాయి, తద్వారా మన నగరం గ్లోబల్ రియల్ ఎస్టేట్ మ్యాప్‌లో ఒక సరికొత్త శిఖరాన్ని చేరుకోనుంది.


