విజయ్‌కు స్టాలిన్ మద్దతు లభించింది. అయితే అది సీట్ల పరంగా కాదు. ప్రజా తీర్పును గౌరవిస్తామని విజయ్ ను అడ్డుకునే ప్రయత్నాలు చేయబోమని స్టాలిన్ ప్రకటించారు. అనిశ్చితి మధ్య, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ..విపరీత ప్రచారాలు జరగకుండా క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు మార్పును కోరుకున్నారు, ఆ తీర్పును మేము గౌరవిస్తాం. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వండి, మేము ఆరు నెలల పాటు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వేచి చూస్తాం అని స్టాలిన్ స్పష్టం చేశారు.
అదే సమయంలో, అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తే లేదని స్టాలిన్ తేల్చిచెప్పారు. ద్రవిడ పార్టీలు రెండూ కలిసి విజయ్ను అడ్డుకుంటాయన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా చూడటం బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తమ విధి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం ద్వారా డీఎంకే తన నైతిక విలువలను కాపాడుకుంటూనే, కొత్త ప్రభుత్వ పనితీరును నిశితంగా గమనించాలని నిర్ణయించుకున్నారు.
కేవలం అధికారం వదులుకోవడమే కాకుండా, కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే విజయ్‌కు స్టాలిన్ విలువైన సలహాలు కూడా ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత అల్పాహార పథకం , మహిళా సాధికారత పథకం కింద నెలవారీ రూ. 1000 సాయం వంటి ప్రజా రంజక కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో విజయ్ ఇచ్చిన భారీ హామీల అమలులో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను గుర్తు చేస్తూ.. మేము చెప్పినవే చేశాం, మీరు కూడా ఆచరణాత్మకమైన పథకాలతో ముందుకు వెళ్లాలి అని ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిగా సలహా ఇచ్చారు.
స్టాలిన్ తాజా స్టేట్మెంట్ తమిళనాడులో నెంబర్ గేమ్ ఉత్కంఠకు తాత్కాలికంగా తెరదించినట్లయింది. కాంగ్రెస్ మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేస్తూనే, వైఫల్యాలు ఎదురైతే ప్రజల పక్షాన నిలబడతామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో 90 శాతం హామీలను నెరవేర్చానని గర్వంగా చెబుతూనే, కొత్తగా వచ్చే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
