ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం మాజీ నేత వెంకట్రామిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. నిన్నటి వరకు అధికార పక్షానికి అనధికార ప్రతినిధి లా వ్యవహరించి, ఇప్పుడు ఉద్యోగం ఊడటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సర్కారు వారు అన్ని నిబంధనలను తూచా తప్పకుండా పాటించి, పకడ్బందీగా డిస్మిస్ ఆర్డర్ చేతిలో పెట్టడంతో.. ఇప్పుడు ఆయనకు న్యాయస్థానాల్లోనూ సాంకేతిక ఊరట లభించడం గగనమే అనిపిస్తోంది. ఉద్యోగం పోగానే వైకాపా తీర్థం పుచ్చుకుని, ఇన్స్టంట్ లీడర్‌గా చెలామణి అవుతారని అంతా అనుకున్నారు కానీ, సీన్ రివర్స్ అయింది.
వైసీపీ కార్యాలయంలో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థులపై విరుచుకుపడిన ఆయన, ఇప్పుడు కోర్టుకు వెళ్లి నేను అసలు ఆ పార్టీ కోసమే పని చేయలేదు అని విన్నవించుకోవడం ఈ ఏడాదికి ముందే వచ్చిన పెద్ద జోక్. సాక్షాత్తూ పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రభుత్వంపై విమర్శలు దృశ్యాలు రాష్ట్రమంతటా వైరల్ అయ్యాక, ఇప్పుడు తాను కేవలం అతిథి ని మాత్రమే అంటే నమ్ముతారా. బహుశా పొన్నవోలు వంటి దిగ్గజ లాయర్లు ఆయన తరపున వకాల్తా పుచ్చుకోవచ్చు గానీ, బహిరంగంగా చేసిన రాజకీయ విన్యాసాలను చట్టం ముందు కప్పిపుచ్చడం తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాకపోవచ్చు.
నిజానికి, జగన్ రెడ్డి తనకు రాజకీయంగా ఏదో ఒక పెద్ద పీట వేస్తారని వెంకట్రామిరెడ్డి గట్టిగా నమ్మారు. కానీ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం చేసి, కీలక బాధ్యతల విషయంలో మాత్రం ఆయనకు నమస్కారం పెట్టేసినట్లు కనిపిస్తోంది. పార్టీలో తగిన గుర్తింపు రాకపోవడం, అటు జగన్ రెడ్డి నుంచి భరోసా లభించకపోవడంతోనే.. మళ్ళీ పాత ఉద్యోగం వెతుక్కుంటూ కోర్టు మెట్లు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
రాజకీయం చేయాలనుకున్నప్పుడు దర్జాగా జెండా పట్టుకోవాలి కానీ, ఇలా రెంటికీ చెడ్డ రేవడిలా మారడం ఆయన స్వయంకృతాపరాధమే. ఒకప్పుడు సచివాలయంలో చక్రం తిప్పిన నేత, ఇప్పుడు వైసీపీ ఆఫీసులో టీ తాగి ప్రెస్ మీట్లు పెట్టి, కోర్టులో మాత్రం నేను అమాయకుడిని అని మొరపెట్టుకుంటున్నారు. పదవి పోయాక పలకరించే నాథుడు లేకపోవడంతో, ఇప్పుడు ఉద్యోగం కోసం ఆయన పడుతున్న పాట్లు కామెడీ గామారుతున్నాయి.
