తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించి, రాష్ట్రానికి ఒక సుస్థిరమైన పరిపాలన అందించాలంటే టీవీకే-అన్నాడీఎంకే కలయికే ఏకైక మార్గం. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ వంటి చిన్న పార్టీలపై ఆధారపడాలని చూడటం దినదిన గండం వంటి వ్యూహమే అవుతుంది. స్వల్ప మెజారిటీతో, అది కూడా సిద్ధాంతపరంగా పొంతన లేని పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ప్రతి బిల్లు ఆమోదానికి లేదా ప్రతి చిన్న నిర్ణయానికి మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. గతంలో ఇటువంటి మైనారిటీ ప్రభుత్వాలు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు బలైపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. విజయ్ తన రాజకీయ ప్రస్థానం ఆరంభంలోనే ఇటువంటి బలహీనమైన పునాదిపై ప్రభుత్వాన్ని నిర్మిస్తే, అది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది.
ఏకైక ప్రత్యామ్నాయం – టీవీకే + అన్నాడీఎంకే
తమిళనాట డీఎంకే బలాన్ని ఢీకొనాలన్నా, ఐదేళ్ల పాటు ఎదురులేకుండా పాలించాలన్నా విజయ్‌కు అన్నాడీఎంకే తో జట్టు కట్టడమే సరైన పరిష్కారం. 108 స్థానాలున్న టీవీకే, 47 స్థానాలున్న అన్నాడీఎంకే కలిస్తే ఆ కూటమి బలం 155కు చేరుకుంటుంది. ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే చాలా ఎక్కువ. ఇలాంటి భారీ మెజారిటీ ఉన్నప్పుడే విజయ్ తను అనుకున్న సంస్కరణలను, హామీలను ధైర్యంగా అమలు చేయగలరు. చిన్న పార్టీల అస్థిరమైన మద్దతు కంటే, ఒక బలమైన ప్రాంతీయ పార్టీతో అధికారాన్ని పంచుకోవడం వల్ల పాలనలో స్పష్టత, స్థిరత్వం వస్తాయి.
ఈగోలు పక్కన పెట్టాల్సిన సమయం
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. నేను ఒంటరిగానే పోరాడతాను, పాత పార్టీలతో కలవను అనే వ్యక్తిగత ఈగోలను విజయ్ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అటు అన్నాడీఎంకే కూడా ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకేకు కూడా అధికారంలో భాగస్వామ్యం లభిస్తే, ఆ పార్టీ కేడర్ మళ్ళీ పుంజుకుంటుంది. ఇద్దరు నేతలు ఒక మెట్టు దిగి, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేతులు కలిపితే.. అది కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే కాకుండా, భవిష్యత్తులో డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పడటానికి దారితీస్తుంది.
వ్యూహాత్మక చాణక్యం అవసరం
విజయ్ ఇప్పుడు ఒక సినిమా హీరోగా కాకుండా, ఒక పరిణతి చెందిన రాజకీయ నేతగా ఆలోచించాలి. చిన్న పార్టీల ట్రాప్‌లో పడి మూడేళ్లలోనే ప్రభుత్వాన్ని పడగొట్టుకోవడం కంటే, అన్నాడీఎంకేతో గౌరవప్రదమైన ఒప్పందం కుదుర్చుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఉత్తమం. ఇలా చేయడం వల్ల అటు బీజేపీ ప్రభావం లేకుండా, ఇటు డీఎంకే రిమోట్ కంట్రోల్ పాలన లేకుండా ఒక స్వచ్ఛమైన ప్రాంతీయ పాలనను ప్రజలకు అందించవచ్చు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంలో విజయ్ చూపే చొరవపైనే తమిళనాడు భవిష్యత్తు ఆధారపడి ఉందన్నది ఎక్కువ మంది అభిప్రాయం.


