ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల సింగపూర్‌లో పర్యటించిన రాష్ట్ర మంత్రుల బృందానికి కీలకమైన బాధ్యతలను అప్పగించారు. వారు వెళ్లింది శిక్షణ కోసం. అక్కడ నేర్చుకున్న పరిపాలనా మెళకువలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన తీరును ఏపీలో క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలో వివరిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సింగపూర్ పర్యటనలో మంత్రులు ప్రధానంగా నగరాభివృద్ధి, జలవనరుల నిర్వహణ, పారిశ్రామిక విధానాలు , డిజిటల్ గవర్నెన్స్‌పై శిక్షణ పొందారు. ఒక చిన్న ద్వీప దేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో అధ్యయనం చేసిన మంత్రులు, ఇప్పుడు ఆ నమూనాను అమరావతి అభివృద్ధిలోనూ, రాష్ట్రంలోని ఇతర నగరాల ఆధునీకరణలోనూ ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీరో వేస్ట్ మేనేజ్మెంట్ , స్మార్ట్ సిటీ కాన్సెప్టులను మన వాతావరణానికి అనుగుణంగా మార్చి అమలు చేసే బాధ్యతను చంద్రబాబు ఆయా శాఖల మంత్రులకు అప్పగించారు.
ముఖ్యమంత్రి రూపొందించిన రోడ్ మ్యాప్ ప్రకారం, ప్రతి మంత్రి తాము సందర్శించిన విభాగాలపై సమగ్ర నివేదికను సమర్పించడమే కాకుండా, రాబోయే 100 రోజుల్లో తమ శాఖలో తీసుకురాబోయే కనీసం మూడు వినూత్న మార్పులను ప్రతిపాదించాల్సి ఉంటుంది. సింగపూర్ తరహాలో పారదర్శకమైన ఫైల్ క్లియరెన్స్ సిస్టమ్ మరియు పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరిపాలనను అందించడమే ఈ టాస్క్ ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల ప్రభుత్వ పనితీరులో జవాబుదారీతనం పెరగడంతో పాటు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
వైసీపీ విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వ వర్గాలు ఈ పర్యటన ప్రాధాన్యతను వివరిస్తున్నాయి. గత ఐదేళ్లలో పాలన పడకేసింది, మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలి అని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, నిర్ణీత గడువులోగా ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి డెడ్ లైన్ విధించారు. చంద్రబాబు తన మంత్రులకు ఇచ్చిన ఈ సింగపూర్ టాస్క్ ఏ మేరకు సఫలమవుతుందనేది వారి పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది.


