విజయ్ మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ప్రకటించలేదన్న కారణంగా ప్రమాణస్వీకారానికి అనుమతి ఇచ్చేది లేదని గవర్నర్ అంటున్నారు. మరి ఇప్పుడు ఎవర్ని పిలుస్తారు?. 118 మంది ఎమ్మెల్యేల లేఖలు ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారా?.
గవర్నర్ అతి చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా అందరిలోనూా వినిపిస్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూసినా విజయ్‌కు మొదటి చాన్స్ ఇవ్వాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అతి పెద్ద పార్టీ నాయకుడిని ఆహ్వానించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుంది. అయితే, తమిళనాట అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ విషయంలో గవర్నర్ ఈ విచక్షణాధికారాన్ని వినియోగించకుండా కాలయాపన చేయడం రాజ్యాంగ విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి.
1996 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేనప్పటికీ, అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ అతిపెద్ద పార్టీ నాయకుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు సమయం ఇచ్చారు. ఇదే సంప్రదాయాన్ని అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు అనుసరించారు. కానీ, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచి, మిత్రపక్షాలతో కలిసి మెజారిటీకి అత్యంత చేరువలో ఉన్నా, గవర్నర్ ముందే సంతకాలు కావాలి అని పట్టుబట్టడం గతంలో ఎన్నడూ లేని కొత్త నిబంధనలను సృష్టించడమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గవర్నర్ వ్యవస్థ అనేది కేంద్ర ప్రభుత్వ చేతిలో పావుగా మారిందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడిని అధికార పీఠం ఎక్కకుండా అడ్డుకోవడమే రాజ్ భవన్ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది రాజ్‌భవన్ గదుల్లో కాదు, అసెంబ్లీ వేదికగా ఫ్లోర్ టెస్ట్ ద్వారా మాత్రమేనని సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి, విజయ్ వద్ద మ్యాజిక్ ఫిగర్ లేదని సాకు చూపుతూ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించకపోవడం ప్రజా తీర్పును అవమానించడమే అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
తమిళనాడులోపార్టీలకు అతీతంగా నేతలు విజయ్‌కు గవర్నర్ చాన్స్ ఇవ్వాలని అంటున్నారు. కానీ గవర్నర్ మాత్రం..భిన్నంగా స్పందించడం వివాదానికి కారణం అవుతోంది.
