కరీంనగర్ జిల్లా రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. కరీంనగర్‌లోని గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో గుమికూడిన బీజేపీ కార్యకర్తలు, కౌశిక్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లు, కర్రలతో దాడి చేయడం కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
అసలు వివాదం పాడి కౌశిక్ రెడ్డి చేసిన తీవ్ర విమర్శలతో మొదలైంది. తంబాకులో డ్రగ్స్ వేసుకుని నములుతాడని..అందుకే వెంట్రుకలు రాలిపోయి గుండు అయిందని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇంకా పలు రకాలుగా తిట్లందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్‌కు నిధులు పంపిస్తున్నారని, కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండికి లేదని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేశాయి. తమ నాయకుడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటంపై బీజేపీ కార్యకర్తలు ఆవేశానికి లోనయ్యారు.
బుధవారం రాత్రి కౌశిక్ రెడ్డి కరీంనగర్లో ఉన్నారన్న సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బండి సంజయ్‌కు క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేస్తూ గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, కొందరు కార్యకర్తలు కౌశిక్ రెడ్డి కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ పెనుగులాటలో కార్యాలయం కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
కరీంనగర్ పట్టణంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగగా, బండి సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మరోవైపు, తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ప్రస్తుతం గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. పాడి కౌశిక్ రెడ్డి వెనుక మార్గం గుండా వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారు.
