ఈ వేసవిని గట్టెక్కించాల్సిన బాధ్యత ‘పెద్ది’ పై పడింది. ఈ సీజన్లో వస్తున్న ఏకైక భారీ సినిమా ఇదే. రికార్డు వసూళ్లు చూడాలన్నా, బాక్సాఫీసు దగ్గర ఫుట్ పాల్స్ పెరగాలన్నా – `పెద్ది` రావాల్సిందే. అందుకే అందరి ఫోకస్ ఈ సినిమాపై ఉంది. జూన్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎడిటింగ్ పనులు కూడా పూర్తయిపోయాయి. సినిమా ఎడిట్ లాక్ చేసినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు అందరి కళ్లూ పెద్ది ట్రైలర్ పైనే. ఈనెలాఖరున ‘పెద్ది’ ట్రైలర్ రాబోతోంది. సినిమా విడుదలకూ, ట్రైలర్ కూ మధ్య రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకొంటోంది చిత్రబృందం. ఈలోగా పాటల్ని రిలీజ్ చేస్తారు.
పెద్ది ట్రైలర్ కోసం బుచ్చిబాబు రెండు మూడు వెర్షన్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అందులో ది బెస్ట్ మాత్రమే బయటకు వస్తుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే గ్రామీణ యాక్షన్ కథా చిత్రమిది. ఇప్పటికే క్రికెట్, కుస్తీ.. పోటీల నేపథ్యంలో టీజర్, గ్లింప్స్ కట్ చేశారు. ఈ సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించిన ఇంకో కోణం ఉందని సమాచారం. దాన్ని ట్రైలర్ లో రివీల్ చేసే ఛాన్స్ ఉంది. ట్రైలర్ కట్ విషయంలో చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకొందని, ఈ ట్రైలర్ తో సినిమాపై హైప్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రిలీజ్ కి రెండు వారాలకు ముందు ఓ ట్రైలర్, రిలీజ్ మరో రెండు రోజుల్లో ఉందనగా మరో ట్రైలర్ వదిలే ఛాన్స్ వుంది. ఇటీవలే హైదరాబాద్ లో ఐటెమ్ సాంగ్ చిత్రీకరించారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఐటెమ్ పాట దుమ్ము రేగే విధంగా డిజైన్ చేశార్ట. ఇందులో శ్రుతిహాసన్ తో పాటు, జాన్వీ కపూర్ కూడా కనిపించనుందని సమాచారం. త్వరలోనే ఐటెమ్ పాటనీ విడుదల చేయనున్నారు.
