వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జా కేసులో పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఆయన ఎక్కడికీ పరారీ కాలేదని, వినుకొండలోని తన నివాసంలోనే ఉంటూ అనుచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వీడియోలు బయటకు వస్తున్నాయి. ఒకవేళ పోలీసులు అరెస్టుకు వస్తే ఏ విధంగా ప్రతిఘటించాలి, ఏ స్థాయిలో ఆందోళనలు చేపట్టాలనే అంశంపై ఆయన తన కేడర్‌కు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన బహిరంగంగా తిరుగుతున్నా, పోలీసులు పరారీ అని ప్రకటించడం వెనుక ఉన్న మతలబు ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
వైసీపీ నేత అయితే ప్రివిలేజెస్ ఉంటాయా?
బ్రహ్మనాయుడుపై ఉన్న ఆరోపణలు సామాన్యమైనవి కావు. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జా చేసేందుకు పెద్ద ముఠాతో కలిసి స్కెచ్వేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా పోలీసు యంత్రాంగం తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయనకు ముందస్తు బెయిల్ పొందేందుకు పోలీసులు పరోక్షంగా సమయం కేటాయిస్తున్నారా అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. నిందితుడు అందుబాటులో ఉన్నా గాలిస్తున్నాం అని చెప్పడం కేవలం కాలయాపన కోసమేనని బాధితులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ నేతల హస్తం కూడా ఉందా?
ఈ భూముల దందాల వెనుక తెలంగాణలోని కొందరు ప్రభావవంతమైన రాజకీయ నేతల హస్తం కూడా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. భూ కబ్జాల వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, పొలిటికల్ లీడర్ల హస్తం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంతర్రాష్ట్ర రాజకీయ సంబంధాల వల్లే బొల్లా బ్రహ్మనాయుడుపై చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం వెనుకంజ వేస్తోందని, ఒకవేళ ఆయనను విచారిస్తే పెద్దల పేర్లు బయటకు వస్తాయనే కారణంగా అరెస్టులపై వాయిదా వేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.
ఇప్పటికీ ప్రయత్నం చేయని పోలీసులు
బ్రహ్మనాయుడు తన న్యాయవాదులతో చర్చలు జరుపుతూ అరెస్టు నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు పరారీలో ఉన్నట్లుగా ప్రకటించినా కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. అంతిమంగా చట్టం తన పని తాను చేస్తుందా లేక రాజకీయ పరపతి వెయ్యి కోట్ల కుంభకోణాన్ని కప్పివేస్తుందా అనేది వేచి చూడాలి.
