తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీలోని కొందరు నేతలు అనుసరిస్తున్న వ్యూహాలు, చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్కే ఎక్కువ లాభం చేకూరుస్తున్నాయి. మందుల సామేలు, అనిరుధ్ రెడ్డి వంటి నేతలు ఇటీవల ఏపీ రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ, ప్రాంతీయ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రాంతీయ సెంటిమెంట్ అనేది బీఆర్ఎస్కు వెన్నెముక వంటిది. దానిని మళ్ళీ రగిల్చడం ద్వారా కేవలం బీఆర్ఎస్కు మాత్రమే రాజకీయంగా ఊపిరి పోసినట్లు అవుతుందని తెలిసినా, ఈ నేతలు అదే దారిలో వెళ్తున్నారు.
సెంటిమెంట్ రాజకీయం- ఎవరికి లాభం?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మార్పు, అభివృద్ధి అనే నినాదంతోనే తప్ప సెంటిమెంట్‌తో కాదు. ఒక వేళ మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్ర-తెలంగాణ సెంటిమెంట్ బలంగా పుంజుకుంటే, ప్రజలు సహజంగానే ఆ సెంటిమెంట్‌కు ఛాంపియన్‌గా భావించే కేసీఆర్ వైపు చూసే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసినా కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ ను.. చంద్రబాబును.. ఏపీ పెట్టుబడులను సాకుగా చూపి విద్వేషాలు రగిలించడం వెనుక పక్కా వ్యూహమున్నట్లు కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసి, బీఆర్ఎస్ను మళ్ళీ రేసులోకి తీసుకురావడానికి వేసిన స్కెచ్‌గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి నిస్సహాయత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధారణంగా క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటారు. కానీ, తన కళ్ళముందే పార్టీ నేతలు సెంటిమెంట్ రాజకీయం చేస్తూ బీఆర్ఎస్కు మేలు చేస్తున్నా ఆయన ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పార్టీలో ఉన్న సీనియర్లు లేదా పాతతరం నేతలు రేవంత్ ఆధిపత్యాన్ని సహించలేక, ఆయనకు చెడ్డపేరు తీసుకురావడానికి ఇలాంటి సెంటిమెంట్ డ్రామా ను ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. కట్టడి చేయగలిగే అవకాశం ఉన్నా, అది మరింత రెచ్చిపోవడానికి కారణం అవుతుందన్న కారణంగా రేవంత్ చూసీ చూడనట్లుగా ఉంటున్నారని భావిస్తున్నారు.
బీఆర్ఎస్కు ఆక్సిజన్ అందిస్తున్న హస్తం నేతలు
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తీవ్ర నైరాశ్యంలో ఉంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి మళ్ళీ ప్రజల్లో పట్టు రావాలంటే ఏదో ఒక భావోద్వేగపూరితమైన అంశం కావాలి. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ నేతలే స్వయంగా అందిస్తుండటం విశేషం. ఏపీ నేతలను తిట్టడం ద్వారా తాము తెలంగాణ బిడ్డలం అని నిరూపించుకోవాలని చూస్తున్న ఈ నేతలు, పరోక్షంగా కేసీఆర్ రాజకీయాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంటనే ఈ కోవర్టు రాజకీయాలను అరికట్టకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అంతా ఈ సెంటిమెంట్ ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.
