తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఉచిత విద్యుత్ అంశం మరోసారి కీలకంగామారింది. జూన్ 2వ తేదీ నుంచి నూతనంగా ఏర్పాటవుతున్న రైతు డిస్కమ్ కేంద్రంగా బీఆర్ఎస్ కొత్త ఆరోపణలు చేయడంతో రేవంత్ గట్టి సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెడితే తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని.. పెట్టకపోతే బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉంటుందా అని ఆయన సవాల్ చేస్తున్నారు.
రైతు డిస్కమ్ వెనుక పక్కా లెక్క!
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు పెడుతున్నారు. మేము రైతులకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం.. ఒకవేళ పెట్టకుండా ఉచిత విద్యుత్ ఇస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ ముఖ్యమంత్రి విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ట్రాన్స్ ఫార్మర్లకు మీటర్లు పెట్టేది విద్యుత్ వినియోగాన్ని లెక్కకట్టి రైతులపై భారం వేయడానికి కాదు, వ్యవస్థలో ఉన్న లొసుగులను అరికట్టడానికేనని ప్రభుత్వం వాదిస్తోంది.
లెక్కల్లో దొరికిపోతున్న అక్రమాలు
ప్రస్తుతం తెలంగాణలో ట్రాన్స్మిషన్ , డిస్ట్రిబ్యూషన్ నష్టాలు సుమారు 20 శాతం వరకు ఉన్నాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ కింద పది వ్యవసాయ మోటర్లు ఉంటే, సగటున రోజుకు ఎన్ని గంటలు నడుస్తాయి, ఎంత విద్యుత్ ఖర్చు కావాలి అనే దానికి ఖచ్చితమైన లెక్క ఉండాలి. ఉదాహరణకు, ఐదు హార్స్ పవర్ల మోటర్లు పది ఉంటే రోజుకు 90 నుంచి 100 గంటల వినియోగం జరగాలి. కానీ ట్రాన్స్ఫార్మర్ వద్ద మీటర్ పెట్టి చూసినప్పుడు అంతకంటే ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంటే.. అక్కడ వ్యవసాయేతర అవసరాలకు విద్యుత్ దొంగతనం జరుగుతోందని అర్థం. రైతు పేరుతో పరిశ్రమలకో లేదా ఇతర వ్యాపారాలకో విద్యుత్ మళ్లించడాన్ని అడ్డుకోవడమే ఈ డిటిఆర్ మీటరింగ్ ప్రధాన ఉద్దేశం. దీనివల్ల డిస్కమ్‌లపై పడుతున్న అదనపు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, రైతులకు నాణ్యమైన వోల్టేజీ అందుతుంది.
బీఆర్ఎస్ ఆందోళన.. రాజకీయ కోణం
మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ రైతు డిస్కమ్ ఏర్పాటును మరియు మీటర్ల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డిస్కమ్ విడగొట్టడం వల్ల రైతులకు స్థానిక అధికారుల నుంచి సేవలు అందవని, ఇది ప్రైవేటీకరణకు తొలి అడుగు అని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల నష్టాలు రూ. 69,741 కోట్లకు చేరడంతో, ఇలాంటి వ్యవస్థాగత మార్పులు తప్పవని ప్రభుత్వం భావిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఈ స్మార్ట్ వ్యూహం సత్ఫలితాలనిస్తే, విద్యుత్ చోరీ తగ్గి ఖజానాకు ఆదా అవుతుంది. అదే సమయంలో రైతులకు నాణ్యమైన కరెంటు అందుతుంది. అయితే, రైతుల్లో నెలకొన్న మీటర్ భయాన్ని తొలగించడంలో ప్రభుత్వం ఎంతవరకు సఫలమవుతుందనేది చూడాలి.
