పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హింసాత్మక సంస్కృతికి అద్దం పడుతూ తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో జరిగిన దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా వెలుగొందుతున్న అభిషేక్ బెనర్జీ పై అల్లరి మూకలు కోడిగుడ్లతో దాడి చేశాయి. ఆయన పర్యటన గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. అల్లరి మూకలు ఆయనను చుట్టుముట్టి దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. నిరసనకారులకు ఆయనను ఎలా వదిలేశారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.
అభిషేక్ బెనర్జీ వంటి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన నేతపై ఇంత బహిరంగంగా దాడి జరగడం వెనుక పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అల్లరి మూకలు దాడి చేస్తున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఆయనను మీడియా ప్రతినిధులే రక్షించి తీసుకెళ్లారు. మమతా బెనర్జీ పాలనలో ప్రతిపక్షాలపై దాడులు సర్వసాధారణమని గతంలో ఆరోపణలు వచ్చేవి, కానీ ఇప్పుడు బీజేపీ పాలనలో అదే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మమతా బెనర్జీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలకు రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అభిషేక్ బెనర్జీపై రాజకీయంగా ఎంతో వ్యతిరేకత ఉండవచ్చు. కానీ ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేయడం మాత్రం ప్రజాస్వామ్యం కాదు. తన పార్టీ సానుభూతిపరులను పరామర్శించేందుకు ఆయన వచ్చినప్పుడు.. పోలీసులు రక్షణ కల్పించాలి. గతంలో ఇలాంటివి తృణమూల్ నేతలు చాలా చేశారని అనుకోవచ్చు. కానీ వారు అలా చేశారని ఇప్పుడు ఇలా చేస్తే.. వారికి, వీరికి తేడా ఏముంటుంది?
