ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యకు ముక్కుకు ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్నారు. ఆయనను పరామర్శించేందుకు చంద్రబాబు హైదరాబాద్లోని పవన్ నివాసాని వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని, ఆపరేషన్ అనంతరం జరుగుతున్న రికవరీ ప్రక్రియను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సుమారు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు క్షేమ సమాచారాలతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పరిపాలనా నిర్ణయాలపై కూడా చర్చించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల ముఖ్యమంత్రికి మర్యాదపూర్వక స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య జరిగిన ఈ భేటీ కీలకంగా మారింది.
