ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా కనిపించని కొడాలి నాని బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉత్తరాది బీజేపీ నేతలతో ఆయన పెంచుకుంటున్న సాన్నిహిత్యమే ఈ చర్చకు కారణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న నాని.. కాషాయ గూటికి చేరాలని భావిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఉత్తరాది బీజేపీ నేతలతో పరిచయాలు పెంచుకుంటున్న కొడాలి నాని
ఈ ప్రచారానికి ప్రధాన బలం చేకూర్చింది ఆయన ఇటీవలి తిరుమల పర్యటన. తిరుమల శ్రీవారి దర్శనం సమయంలో మహారాష్ట్రకు చెందిన ఒక కీలక బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి కొడాలి నాని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా పేర్ని నాని, వంశీ వంటి నేతలతో తప్ప ఇతరులతో బహిరంగంగా కనిపించడానికి ఇష్టపడని నాని, ఏకంగా బీజేపీ నేతలతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని అనుకోవచ్చు. కేవలం అది యాదృచ్ఛిక కలయిక మాత్రమే కాదని, ఆ తర్వాత కూడా ఆయన సదరు నేతలతో నిరంతరం టచ్లో ఉండటం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.
బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవచ్చు..!
కొడాలి నాని బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోవడానికి ఆయన జాతీయ స్థాయి రక్షణ కోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాది నేతల ద్వారా కేంద్ర పెద్దల వద్దకు తన ప్రతిపాదనలను పంపే ప్రయత్నంలో భాగంగానే ఈ సాన్నిహిత్యం పెరిగిందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. కొడాలి నాని బీజేపీలో చేరడం అంత సులభం కాదనే వాదన కూడా ఉంది. గతంలో ఆయన బీజేపీ అగ్ర నాయకత్వంపై, ముఖ్యంగా హిందూత్వ అంశాలపై చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
చేసిన నిర్వాకాలకు తప్పించుకోవడం అంత సులువు కాదు!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే సూత్రం ప్రకారం.. తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లో తన పట్టును నిలబెట్టుకోవడానికి బీజేపీ అండ అవసరమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కొడాలి నాని రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక చిక్కుముడిలా మారింది. వైఎస్ జగన్కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ముద్రపడిన ఆయన, నిజంగానే బీజేపీ వైపు అడుగులు వేస్తే వైసీపీకి పెద్ద షాక్ అవుతుంది.
