తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పొంగులేటి పేరు ఒక సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మంత్రి కుటుంబానికి చెందిన కంపెనీలు భారీ ప్రాజెక్టులను చేజిక్కించుకోవడం, అందులోనూ టెండర్ నిబంధనలను సవరించి మరీ లీడ్ పార్ట్నర్గా అవతరించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. తాజాగా హైదరాబాద్ మురుగునీటి శుద్ధి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ఈ వివాదాన్ని మరింత రాజేసింది.
పొంగులేటి కాంట్రాక్టుల పర్వం!
తెలంగాణలో కాంట్రాక్టుల పంపకం సరికొత్త మలుపులు తిరుగుతోంది. హైదరాబాద్ నగరంలో దాదాపు రూ.1,906 కోట్ల వ్యయంతో చేపట్టే మురుగునీటి శుద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. టెక్నికల్ అర్హతలు చూపి టెండర్ గెలిచిన బీవీఎస్ఆర్ కంపెనీని పక్కన పెట్టి, కేవలం మైనర్ భాగస్వామిగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ను లీడ్ పార్ట్నర్గా మారుస్తూ అధికారికంగా జీవో విడుదల చేశారు. టెండర్ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్న కంపెనీయే ప్రాజెక్టును నడిపించాలి, కానీ ఇక్కడ మాత్రం రాఘవ వాటా 23 శాతం నుంచి 51 శాతానికి పెరగింది.
ఆగని కాంట్రాక్టుల ప్రవాహం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగులేటి కుటుంబానికి చెందిన కంపెనీలు వరుసగా భారీ కాంట్రాక్టులను దక్కించుకుంటున్నాయి. కేవలం ఈ ఎస్టీపీ ప్రాజెక్టు మాత్రమే కాదు, అంతకుముందు కూడా పలు కీలక ప్రాజెక్టుల్లో రాఘవ కంపెనీ పేరు వినిపించింది. గతంలోనూ గృహ నిర్మాణ రంగంలో భారీ కాంట్రాక్టులు ఈ సంస్థకే దక్కాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని కీలక కాలువ పనులు, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లోనూ ఈ సంస్థ వాటా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పలు రహదారి పనుల్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ అగ్రస్థానంలో నిలుస్తోంది. న్ని విమర్శలు వచ్చినా, విచారణల పేరుతో హడావుడి జరిగినా, చివరికి కాంట్రాక్టులు మాత్రం మంత్రి ఇలాకాకే చేరుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనల ఉల్లంఘనేనా?
సాధారణంగా ప్రభుత్వం పిలిచే టెండర్లలో ‘టెక్నికల్ బిడ్’ అత్యంత కీలకం. ఏ అనుభవం లేని కంపెనీలకు పెద్ద ప్రాజెక్టులు ఇవ్వకూడదనే నిబంధన ఉంటుంది. అందుకే రాఘవ కన్స్ట్రక్షన్స్ గతంలో BVSR వంటి అనుభవం ఉన్న సంస్థలతో జాయింట్ వెంచర్ కట్టింది. అయితే, టెండర్ గెలిచిన తర్వాత ఆ నిష్పత్తిని తలకిందులు చేయడం అంటే.. నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకోవడమేనని చెబుతున్నారు. టెక్నికల్ క్రెడిబిలిటీ BVSR ది అయితే, ఆర్థిక ప్రయోజనాలు , నిర్ణయాధికారం మాత్రం మంత్రి కుమారుడి కంపెనీకి బదిలీ చేయడంపై న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం కూడా ఉంది.
వరుస వివాదాలు
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తామని చెబుతుండగా, మరోవైపు మంత్రి కుటుంబానికి కట్టబెడుతున్న ఈ భారీ ప్రాజెక్టులు ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న పొంగులేటి, తన పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థికంగా బలపడుతున్నారని విపక్ష నేతలు బీఆర్ఎస్ , బీజేపీ ఘాటుగా విమర్శిస్తున్నాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వివాదాల్లోనూ పెద్ద ఎత్తున పొంగులేటి కంపెనీలపై ఆరోపణలు వస్తున్నాయి.
