సినిమా తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా గండాల్ని దాటుకొని రావాలి. సినిమా విడుదలయ్యాక, హిట్టూ, ఫ్లాపూ అనే విషయాలు పక్కన పెట్టండి. అసలు సినిమా తీయడంలోనే అసలైన సవాల్ ఉంది. సెట్లో అవకతవకల్ని అరికట్టాలి. అనుకొన్న బడ్జెట్ లో సినిమా తీయాలి. హీరోలు, దర్శకుల మైండ్ సెట్ ని అర్థం చేసుకొని, వాళ్ల ఈగోల్ని సంతృప్తి పరచుకొంటూ సినిమాలు తీయాలి.. ఇదంతా తలనొప్పి వ్యవహారమే. దర్శకుల ఎంపిక విషయంలో నిర్మాతలు తప్పులు చేస్తే పర్యావసానాలు ఎలా ఉంటాయో ‘బ్యాడ్ బోయ్ కార్తీక్’ సినిమా తెలియజేస్తుంది.
నాగశౌర్య హీరోగా నటించిన సినిమా ఇది. ఈవారమే వస్తోంది. ఎక్కడా హైప్ లేదు. నిర్మాతలు ఒక్క రూపాయి కూడా పబ్లిసిటీకి ఉపయోగించడం లేదు. ఇంత కంటే చిన్న సినిమాలు `పాపం ప్రతాప్`, `తిమ్మరాజు పల్లి` హడావుడి చేస్తున్నాయి కానీ, `బ్యాడ్ బోయ్` మాత్రం సందడి చేయలేకపోతున్నాడు.
దానికి కారణం.. నిర్మాతల కష్టాలే. ఈ సినిమా కోసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాతలు. అందులో వేస్టేజీనే ఎక్కువ. ముందు ఓ దర్శకుడ్ని తీసుకొన్నారు. ఆయన్ని పక్కన పెట్టాల్సివచ్చింది. ఆ తరవాత మరో దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. తనకీ నిర్మాతకూ క్లాష్. సినిమా మేకింగ్ లో అవకతవకలు జరిగాయని దర్శకుడిపై నిర్మాత ఛాంబర్లో ఫిర్యాదు కూడా చేశారు. అందుకే సదరు దర్శకుడు ఈ సినిమా ప్రమోషన్లలో కనిపించడం లేదు. ఈ సినిమాలో కొంత భాగానికి కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ దర్శకత్వం వహించారట. అంటే ఈ సినిమాకు ముగ్గురు దర్శకులన్నమాట. హీరో కూడా ఈ సినిమాని వదిలేసుకొన్నవాడే. కానీ నిర్మాతల కోసం ఆయన ప్రమోషన్లలో బలవంతంగా పాల్గొంటున్నాడట. ప్లానింగ్ లేకపోవడం, నమ్ముకొన్న వాళ్లు దగా చేయడంతో నిర్మాత ఎంత నష్టపోతున్నాడో చెప్పడానికి ఈ సినిమా ఓ ఉదాహరణగా నిలుస్తుంది. రూ.30 కోట్ల పెట్టుబడి పెడితే ఇప్పటికి రూ.5 కోట్లు కూడా వెనక్కి రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగశౌర్య సినిమా థియేటర్ల దగ్గర అద్భుతాలు సృష్టిస్తే తప్ప నిర్మాత గట్టెక్కే పరిస్థితి లేదు.


