పాన్ ఇండియా అనే ట్రెండ్ ఎప్పుడైతే మొదలైందో సినిమా అనేది కలగూరగంప అయిపోయింది. తెలుగు సినిమాలో బాలీవుడ్ నటులు, కోలీవుడ్ టెక్నీషియన్లు కనిపించడం చాలా సాధారణం అయిపోయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే.. నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని దిగుమతి చేసుకోవడం తప్పనిసరి అనుకొంటున్నారు. పెద్ద హీరోల సినిమాలూ అదే దిశలో ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు ‘డ్రాగన్’ కూడా పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా రూపు రేఖలు సంతరించుకొంటోంది.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘డ్రాగన్’. రుక్మిణీ వసంతన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో అలియాభట్ ని మరో కథానాయికగా తీసుకొన్నారని వార్తలొస్తున్నాయి. అంతే కాదు.. విలన్ పాత్రకు షాహిద్ కపూర్ ని తీసుకొన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. విలన్ పాత్ర కోసం చాలామంది పేర్లు పరిశీలించారు. టొవినో థామస్ పేరు గట్టిగా వినిపించింది. అయితే డేట్లు ఎడ్జిస్ట్ చేయలేకపోవడం వల్ల టొవినో ఈ సినిమాని మిస్ చేసుకొన్నాడు. షాహిద్ గనుక ఒప్పుకొంటే `డ్రాగన్`కు పూర్తిగా బాలీవుడ్ లుక్ వచ్చినట్టు అవుతుంది.
నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ల పాత్ర రెగ్యులర్ మీటర్ లో సాగదని ముందు నుంచీ సమాచారం అందూనే ఉంది. రుక్మిణి వసంతన్ ఉన్నా పాటలూ, డ్యూయెట్లు లాంటివి ఏం ఉండవని సమాచారం. మరి.. అలియాకు ఎలాంటి క్యారెక్టర్ దక్కబోతోందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలియాని ఓ ఐటెమ్ సాంగ్ కోసమే సంప్రదించారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాలో రుక్మిణితో పాటు మరో కథానాయిక కనిపించడం ఖాయం. ఆ పాత్ర అలియా చేస్తుందా, మరో కథానాయిక కనిపిస్తుందా అనేదే తేలాలి.


