జగన్ నుంచి హీరోయిజం ఆశిస్తున్న వైసీపీ క్యాడర్ కు కామెడీ ఇస్తున్నారు. దక్షిణాదికి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందంటున్న..బీజేపీయేతర పార్టీల విధానానాన్ని ఎన్డీఏ పార్టీ తరహాలో వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు తాము బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు వైసీపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లుపై తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా దీనిని స్వాగతిస్తున్నామని ఆయన ప్రకటించేశారు.
బిల్లుకు మద్దతివ్వాలని బీజేపీ కోరలేదు. చంద్రబాబు కోరారు. అయితే చంద్రబాబు ప్రస్తావన లేకుండానే ఆయన మద్దతు ప్రకటించేశారు. జగన్ అనుమతి లేకుండా సజ్జల ఇలాంటి ప్రకటనలు చేయరు. వాస్తవానికి, జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనతో అటు తమిళనాడు, కేరళతో పాటు తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ, వైసీపీ మాత్రం ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించుకుంది.
టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది. దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడాలని అనుకుంటోంది. వైసీపీ ఎన్డీఏలో లేదు కానీ.. తమ విధానం ఎన్డీఏకే మద్దతు అన్నట్లుగా ఉంటుంది. ఏపీలో అధికారంలో ఉన్నా.. ఎన్డీఏ అధికారంలో ఉన్నట్లుగా కాక.. చంద్రబాబు అధికారంలో ఉన్నట్లుగా మాత్రమే విమర్శలు చేస్తారు. బీజేపీకి ఎెదురు వెళ్లలేని వైసీపీ అధినేత జగన్ ఆశక్తత వల్లే ఇలాంటి సమస్యలు వైసీపీకి వస్తున్నాయి.
