ఘట్టమనేని ఇంటి నుంచి మరో వారసుడు వచ్చాడు. తనే జయకృష్ణ ఘట్టమనేని. సూపర్ స్టార్ కృష్ణకు మనవడు, రమేష్ బాబు తనయుడు.. జయకృష్ణ. ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్‌ని ఈరోజు విడుదల చేశారు.
ఘట్టమనేని జయకృష్ణ లుక్స్ బాగున్నాయి. యూత్ కి నచ్చేలా కనిపిస్తున్నాడు. చివరి షాట్ లో మాత్రం రమేష్ బాబు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. యూత్ కథలకు సరిపోతాడన్న నమ్మకాన్ని ఈ టీజర్ కలిగించింది. తిరుపతి నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. శ్రీను – మంగ అనే అబ్బాయి, అమ్మాయి ఎలా ప్రేమలో పడ్డారు, వాళ్లకెదురైన ఆటంకాలేంటి? అనేవి తెరపై చూపించబోతున్నారు. చివర్లో మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఆయన క్యారెక్టర్ పై కూడా చిత్రబృందం గట్టి ఆశలే పెంచుకొంది. సినిమాపై కుతూహలం పెంచడంలో టీజర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు ఎలాగూ మహేష్ బాబు అండదండలు ఉంటాయి. ఆయన కూడా ప్రమోషన్లలో కనిపించే అవకాశం ఉంది. అది ఈ సినిమాకు భారీగా ప్లస్ అయ్యే ఛాన్సుంది. టీజర్ లో అక్కడక్కడ ‘ఆర్.ఎక్స్. 100’ ఫ్లేవర్ కనిపించింది. దర్శకుడు టేకింగ్ లో ఆ పంథా ఫాలో అయ్యాడేమో? మొత్తానికి టీజర్ తో పాస్ మార్కులు కొట్టేశాడు ఘట్టమనేని హీరో. మరి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.
