నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయ లోపం తరచూ బయటపడుతోంది. అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను వాడకపోవడంస, నామమాత్రంగా చిన్నదిగా పెట్టడంపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న ప్రోటోకాల్ విషయంలోనూ ఆయన అధికారులను, జనసేన నేతలను నిలదీస్తుండటంతో కూటమిలో సెగలు పుడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల కంటే, ఫోటోలు, ఫ్లెక్సీల చుట్టూనే రాజకీయం తిరుగుతుండటం నియోజకవర్గంలో హైలెట్ అవుతున్నాయి.
ఈ వివాదానికి ప్రధాన కారణం వర్మ , పెండెం దొరబాబుల మధ్య ఉన్న పాత వైరం. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఒకే కూటమిలో ఉన్నారు. వైసీపీ నుండి వచ్చి జనసేనలో చేరిన దొరబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా పెత్తనం చలాయించడం వర్మకు మింగుడుపడటం లేదు. కూటమి ధర్మాన్ని పాటించకుండా వర్మ పదేపదే రచ్చ చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని జనసేన నేతలు వాదిస్తున్నారు. చిన్నపాటి పొరపాట్లను పెద్దవి చేసి చూపిస్తూ, సభలను రసాభాస చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని వారు మండిపడుతున్నారు.
చంద్రబాబు ఫోటో విషయంలో తలెత్తిన లోపాలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా, బహిరంగంగా గొడవకు దిగడం కూటమి స్ఫూర్తికి విరుద్ధమని హితవు పలుకుతున్నారు. వర్మ అనుసరిస్తున్న ఈ ధోరణి వల్ల ఆయనకే మైనస్ మార్కులు పడుతున్నాయని చెబుతున్నారు. అధికారులను నిలదీయడం, పరస్పరం దూషణలకు దిగడం వల్ల పాలనపై ప్రభావం పడుతోంది. ఇప్పటికైనా టీడీపీ, జనసేన అధిష్ఠానాలు జోక్యం చేసుకుని ఇరువురు నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరుకు స్వస్తి పలకాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.


