జగిత్యాలలో జరిగిన జీవన్ రెడ్డి చేరిక సభపై కవిత సెటైర్లు వేశారు. 75 ఏళ్ల కురువృద్ధులే నవ యువకులని, వారే తెలంగాణకు దిక్కు అని చెబితే.. మరి రాష్ట్రంలోని అసలైన యువత చచ్చిపోయారా? బ్రతికున్నారా? వారి భవిష్యత్తు ఏంటి?” అంటూ ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె.. వయసు మళ్లిన నేతలే యువతకు ప్రతినిధులుగా చలామణి అవ్వాలని చూడటం హాస్యాస్పదమని, ఇది యువత ఆకాంక్షలను వెక్కిరించడమేనని ఆమె మండిపడ్డారు.
పరోక్షంగా తన తండ్రి కేసీఆర్ రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాలనే అర్థం వచ్చేలా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీపై కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీలో మహిళలకు ఏమాత్రం గౌరవం లేదని, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పార్టీ నడుస్తోందని ఆరోపించారు. ఓటమికి కార్యకర్తలను, ప్రజలను నిందించడం కేసీఆర్‌కు తగదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి, కేవలం తన చుట్టూ ఉన్న కొందరు స్వార్థపరుల మాటలకే ప్రాధాన్యత ఇస్తుండటం వల్లే పార్టీ ఈ స్థితికి చేరుకుందని ఆమె విశ్లేషించారు.
రేవంత్ పైనా విరుచుకుపడ్డారు. గుంట నక్క ఢిల్లీలో ఆర్.ఎస్.ఎస్ పెద్దలను కలవడానికి వెళ్లారని రేవంత్ రెడ్డి అంటున్నారని..కానీ సీఎం రేవంత్ రెడ్డి గుంట నక్కతో డీల్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పులను ప్రభావితం చేసే విధంగా సీఎం మాట్లాడుతున్నారని.. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. వచ్చే పదేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఎలా ఉంటారని..తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి డిసైడ్ చేయాలి కదా… అని ప్రశ్నించారు. రెండు పార్టీలు బల ప్రదర్శన చేస్తున్నాయి..ప్రజల సెంట్రిక్ గా రాజకీయాలు రావాలన్నారు. ఆడబిడ్డగా కొత్త తరహా రాజకీయాలతో మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.