బెంగాల్ లో ఐ ప్యాక్ సంస్థపై జరుగుతున్న విచారణ లింకులు ఏపీ వైపు వస్తున్నాయి. ఇప్పటికే బెంగాల్ లో కోల్ స్కామ్‌లో ఐ ప్యాక్ సంస్థను చూస్తున్న ఐ ప్యాక్ డైరక్టర్ ను అరెస్టు చేయగా.. గతంలో ఏపీలో జగన్ తో కలిసి పని చేసిన ఐ ప్యాక్ డైరక్టర్ రిషిరాజ్ సింగ్ ను ఈడీ విచారణకు పిలిచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన రిషి రాజ్ సింగ్, ఐ-ప్యాక్ ద్వారా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విచారణ ద్వారా వైసీపీ ప్రభుత్వానికి, ఐ-ప్యాక్‌కు మధ్య ఉన్న ఆర్థిక మూలాలను వెలికితీయాలని ఈడీ భావిస్తోంది.
రిషిరాజ్ సింగ్ వైసీపీ హయాంలో పెత్తనం చేశాడు. ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని పరోక్షంగా శాసించారు. ఎన్నికల ఫలితాలు రాక ముందే ఆఫీసు ఖాళీ చేసి వెఎళ్లిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ పథకాల ప్రచారం, సోషల్ మీడియా నిర్వహణ . ఎన్నికల వ్యూహాల పేరుతో ఐ-ప్యాక్ సంస్థకు భారీగా నిధులు మళ్లాయనే ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించి రాజకీయ ప్రయోజనాల కోసం ఐ-ప్యాక్‌కు కట్టబెట్టారని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు రంగంలోకి దిగిన ఈడీ, ఆ నిధుల ప్రవాహం ఎక్కడి నుంచి మొదలైంది? నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా షెల్ కంపెనీల ద్వారా చెల్లింపులు జరిగాయా? అనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తోంది.
ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం నుంచి ఐ-ప్యాక్‌కు అందిన నిధుల వివరాలు, ఆ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులపై ఈడీ ఆరా తీస్తోంది.అలాగే లిక్కర్ స్కామ్ సొమ్ము కూడా ఐ ప్యాక్ కు మళ్లిందన్న అనుమానాలు ఉన్నాయి. రిషి రాజ్ సింగ్ నేతృత్వంలోని బృందం ఏపీలో పనిచేసిన సమయంలో జరిగిన బ్యాంక్ లావాదేవీల చిట్టాను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో పార్టీ నిధులు కాకుండా, ప్రభుత్వ ఖజానా నుంచి ఐ-ప్యాక్ ప్రతినిధులకు ఏ రూపంలోనైనా లబ్ధి చేకూరిందా అనే విషయాన్ని నిరూపించేందుకు ఈడీ కీలక సాక్ష్యాలను సేకరిస్తోంది.
రిషి రాజ్ సింగ్ విచారణ చక్వాచ వైసీపీ అగ్రనేతలకు , ఈ సంస్థకు మధ్య ఉన్న ఆర్థిక ఒప్పందాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఐ-ప్యాక్ డైరెక్టర్‌కు సమన్లు అందడం కేవలం ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో వైసీపీకి చెందిన మరికొందరు కీలక నేతలకు కూడా ఈ మనీ లాండరింగ్ కేసులో నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
