ఉద్యోగం చేస్తున్నాడో.. వైసీపీకి పని చేస్తున్నాడో అన్నట్లుగా ఒళ్లు తెలియకుండా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలడంతో, ఆయనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారని విచారణలో నిర్ధారణ కావడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
వెంకట్రామిరెడ్డిపై ప్రధానంగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు బలంగా ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో కడప జిల్లా బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై, వైసీపీకి ఓటు వేయాలని ఆయన బహిరంగంగా ప్రచారం చేశారు. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కడప కలెక్టర్ నివేదిక ఆధారంగా అప్పట్లోనే ఆయనను పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ పదవి నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ కాలంలో కూడా వెంకట్రామిరెడ్డి తన తీరు మార్చుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. సస్పెన్షన్‌లో ఉన్న సమయంలో హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలనే నిబంధనను పక్కనపెట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేశారని, ఇతర ఉద్యోగులను ప్రభావితం చేసేలా వ్యవహరించారని విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేశారని, నిబంధనలకు విరుద్ధంగా మందు పార్టీలు ఏర్పాటు చేసి ఉద్యోగులను ప్రలోభపెట్టారనే అభియోగాలు కూడా ఆయనపై ఉన్నాయి.
గత ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, ఉద్యోగుల సంఘం ముసుగులో రాజకీయాలు చేశారనే విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. కేవలం వైసీపీ ప్రచారం మాత్రమే కాకుండా, అనేక సర్వీస్ నిబంధనల ఉల్లంఘనలు మరియు అధికార దుర్వినియోగం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక విచారణలో గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను శాశ్వతంగా విధుల్లోంచి తొలగిస్తూ ప్రభుత్వం గట్టి సంకేతాన్ని పంపింది. ఇప్పుడు ఆయన నేరుగా వైసీపీలో చేరి రాజకీయాలు చేసుకోవచ్చు.
