జగిత్యాలలో జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు నిర్వహించిన స్పీచ్ లో కేసీఆర్ కాళేశ్వరం ప్రస్తావన తీసుకు రాలేదు. ఓ వైపు కాళేశ్వరం పేరుతో..మేడిగడ్డ పేరుతో రేవంత్ రెడ్డి మిస్సైల్స్ వదులుతూంటే..కేసీఆర్ మాత్రం స్పందించకపోవడం జగిత్యాలసభలో ఆయన స్పీచ్ చప్పగా ఉందన్న అభిప్రాయం రావడానికి కారణం అవుతోంది. అసలు సంబంధం లేని హైడ్రాను తీసుకు వచ్చి అధికారంలోకి రాగానే తొలి సంతకం.. హైడ్రా రద్దు మీద పెడతానని చెప్పడం కేసీఆర్ రాజకీయాల్లో తనదైన టచ్ కోల్పోతున్నారని అనిపించడానికి కారణం అవుతోంది.
స్పీచ్ మొత్తం మీద తాను ఏం చేశారో చెప్పుకున్నారు.. కాంగ్రెస్ ఏం చేయలేదో చెప్పుకున్నారు. అసలు ఇప్పుడు తాను లేకపోవడం వల్ల జనం కరువులో ఉన్నారని బాధపడే ప్రయత్నం చేశారు. పాత విషయాలన్నీ చెప్పుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించారు.కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో చీల్చి చెండాడేందుకు మాత్రం ఆయన ఎక్కువ సమయం కేటాయించలేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టాక గెలవని జీవన్ రెడ్డిని ఓ గొప్ప నాయకుడిగా ఎలివేట్ ఇస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగం చూసే వారికే .. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకే ఇబ్బందికరంగా మారింది. కేకేకు ఇచ్చినట్లుగా సెక్రటరీ జనరల్ పదవి ఇస్తారని అనుకున్నారు కానీ.. ఆయనకు రాష్ట్ర స్థాయిలో అవసరం లేదని.. ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి.. జగిత్యాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలు చూసుకోవాలని చెప్పారు. అంటే.. కేకే స్థాయి లేదని కేసీఆర్ చెప్పినట్లయింది.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ప్రత్యర్థులు తన చావు కోరుకుంటున్నారని చెప్పుకోవడం కామన్ అయింది. ఈ సభలోనూ అదే చెప్పుకున్నారు. తన చావు కోరుకుంటున్నారని.. అలా కోరుకునేవారు వెయ్యి జన్మలెత్తినా తాను పోనన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ఎంత వరకూ ఉపయోగమో కానీ.. బీఆర్ఎస్ నేతలు మాత్రం సభను విజయవంతం చేసేందుకు గట్టి ప్రయత్నం చేశారు. వచ్చినప్పటి నుండి సీఎం కేసీఆర్ అనే నినాదాలు ఇప్పించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే కార్యకర్తలు కేటీఆర్ వస్తే కేటీఆర్ సీఎం అని అరుస్తారు. ఇలాంటివి రాజకీయంగా పెద్దగా వర్కవుట్ అవ్వవు. కేసీఆర్ ప్రసంగం అంటే ఓ స్టాండర్డ్ ఎప్పుడో క్రియేట్ అయింది. కానీ దాన్ని కేసీఆర్ అందుకోలేకపోతున్నారు.. ఆవిర్భావ సభ అయినా.. జగిత్యాలసభ అయినా అంతే అనుకోవచ్చు.
