కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉల్లిపాయ మంత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో పేలుతోంది. విదేశాల్లో చదువుకుని, ఆధునిక భావాలున్న వ్యక్తిగా పేరున్న సింధియా.. ఎండదెబ్బ తగలకుండా జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటానని, కారులో ఏసీ కూడా వేసుకోనని చెప్పడం అందరినీ అశ్చర్యపరిచింది. సైన్స్ కంటే సెంటిమెంటే మిన్న అన్నట్లుగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే, పాతకాలం నాటి చిట్కాలకు రాజకీయ రంగు పులిమినట్లు కనిపిస్తోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇలాంటి వింత తర్కాలు చెప్పడంలో సింధియా ఒంటరి వారేమీ కాదు. గతంలో బిజెపి నేతలు ఆవు పేడ, గోమూత్రం నుంచి మొదలుకొని విమానాలు, ప్లాస్టిక్ సర్జరీ వరకు పురాణ కాలంలోనే ఉన్నాయని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సింధియా కూడా అదే బాటలో చేరిపోవడంతో, బీజేపీలో చేరకముందు వరకు లాజిక్‌గా మాట్లాడే నేతలు కూడా, కాషాయ కండువా కప్పుకోగానే ఇలా అవుతారా అన్న సందేహానికి వస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మారే క్రమంలో నేతలు తమ మేధస్సును కూడా పక్కన పెడుతున్నారన్నది నెటిజన్ల ప్రధాన విమర్శ.
రాజకీయంగా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యర్థులకు మంచి అస్త్రాలుగా మారాయి. కేంద్రమంత్రి గారే స్వయంగా ఉల్లిపాయ జేబులో ఉంటే ఏసీ అవసరం లేదని చెబుతున్నారు కాబట్టి, సామాన్యులకు విద్యుత్ బిల్లుల భారం తప్పించే అద్భుతమైన ఐడియా ఇచ్చారు ” అంటూ విపక్షాలు వెటకారం చేస్తున్నాయి. విద్యావంతులైన నేతలు ఇలాంటి అశాస్త్రీయ విషయాలను ప్రచారం చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అది ఎండదెబ్బ వంటి ఆరోగ్య సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తుందని కొంత మంది సీరియస్ గా స్పందిస్తున్నారు.
అసలే వేసవి ఎండలు మండిపోతుంటే, ఏసీలు మానేసి ఉల్లిపాయలు జేబులో పెట్టుకోమంటే జనం తట్టుకోవడం కష్టమే. సింధియా ఉల్లిపాయ కథ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద కామెడీ షోలా మారిపోయింది. బీజేపీలో చేరాక ఇలా మారతారా.. లేక అలా మారిన వాళ్లే బీజేపీకి సెట్ అవుతా అన్న సెటైర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
