విశాఖలో ఇన్ఫోసిస్ ఇరవై ఎకరాల్లో భారీ క్యాంపస్ పెట్టాలని నిర్ణయించుకుంది. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంస్థకు 20 ఎకరాలను లీజుకు కేటాయించింది. గతంలో శాటిలైట్ ఆఫీసును ప్రారంభించిన ఈ ఐటీ దిగ్గజం, పూర్తిస్థాయి శాశ్వత క్యాంపస్ కోసం భూమి కావాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, కేబినెట్, రాష్ట్ర పెట్టుబడుల సమావేశాల్లో ఈ భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
ఈ కొత్త క్యాంపస్ ద్వారా సుమారు 750 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రానుంది. అంతేకాకుండా, దీనివల్ల ప్రత్యక్షంగా దాదాపు 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. విశాఖలోని ఎండాడ ఐటీ హిల్స్ లో జాతీయ రహదారికి సమీపంలో ఈ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు సమాచారం. ఇతర దిగ్గజ సంస్థలైన టీసీఎస్ , కాగ్నిజెంట్‌లకు ఇచ్చిన రాయితీల తరహాలోనే ఇన్ఫోసిస్‌కు కూడా ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేవలం ఇన్ఫోసిస్ మాత్రమే కాకుండా, విశాఖ పరిసరాల్లో మరిన్ని ఐటీ, ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయిస్తోంది. గూగుల్ ఏఐ హబ్‌కు బుధవారం శంకుస్థాపన జరగనుంది. ఇన్ఫోసిస్ వంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీ తన శాశ్వత క్యాంపస్‌ను ప్రారంభించడం వల్ల విశాఖపట్నం ఐటీ రంగంలో బెంగళూరు, హైదరాబాద్ తరహాలో కీలక నగరంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.


