ఓవైపు నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు నుంచి బాలయ్య కొత్త కథలు వింటున్నారు. ఇటీవల ఆయనకు చాలామంది దర్శకులు కలిశారు. కథలు చెప్పారు. వశిష్ట, క్రిష్, వివేక్ ఆత్రేయ, శ్రీనివాసరాజు (దండుపాళ్యం ఫేమ్), హరీష్ శంకర్, విజయ్ కనకమేడల… ఇలా ఈ లిస్టు చాలా పెద్దదే ఉంది. ఇప్పుడు ఆయన కొరటాల శివ కథకు ఓకే చెప్పారని ఇన్ సైడ్ వర్గాల టాక్. గోపీచంద్ మలినేని సినిమాతో సమాంతరంగా ఈ సినిమానీ పట్టాలెక్కించి, ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు. గోపీచంద్ సినిమా ఈ యేడాది చివర్లో, కొరటాల సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. 2027 సంక్రాంతి బరి లక్ష్యంగానే ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది.
‘దేవర’ తరవాత ‘దేవర 2’ చేయాలి కొరటాల శివ. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఆ తరవాత మళ్లీ ఎన్టీఆర్ నుంచి పిలుపు రావడంతో ‘దేవర 2’పై ఆశలు చిగురించాయి. అయితే ప్రస్తుతం ‘డ్రాగన్’ పనుల్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ‘దేవర 2’ మొదలవ్వాలంటే కచ్చితంగా ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వాల్సిందే. అందుకే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని కొరటాల ఎప్పుడో ఫిక్సయ్యారు. కానీ సరైన హీరో దొరకడం లేదు. బాలయ్యతో ప్లాన్ కూడా ఎప్పటి నుంచో.. పెండింగ్ లో ఉంది. ఇది వరకే బాలయ్యని కలిసి కథ చెప్పారు. కానీ బాలయ్య ముందు క్యూ ఎక్కువ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందా, లేదా? అనే డైలామా ఉండేది. అయితే ఇప్పుడు దృష్టి కొరటాల వైపు మళ్లిందని, ఈ కాంబో దాదాపు ఫిక్సని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అతి త్వరలో ఈ ప్రాజెక్టు గురించి ఓ ప్రకటన రావొచ్చు.
