ఇండస్ట్రీలో ఒక్క హీరో కూడా ఖాళీగా లేడు. ఎవరి పేరైనా తీయండి.. రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నవారే. హిట్టున్నా, లేకపోయినా ఇదే తీరు. కొత్త నిర్మాతలు జోరుగా రావడం, కొన్నా, కొనకపోయినా ఓటీటీలు ఉన్నాయన్న ధీమా… వాటినే నిర్మాతలు నమ్ముకోవడం, దర్శకులు కథల్ని రెడీ చేయడంలో స్పీడు పెంచడంతో.. సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. దాంతో హీరోలంతా చేతి నిండా సినిమాలతో ఉన్నారు. యువ హీరోలైతే మరీనూ. కానీ వీళ్లందరి మధ్య.. నాగశౌర్య చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో యూత్ లో మంచి పేరు తెచ్చుకొన్నాడు నాగశౌర్య. ఒకప్పుడు నాగశౌర్య ముందు కూడా పెద్ద క్యూ ఉండేది. చేతిలో నిర్మాణ సంస్థ ఉండడం కూడా కలిసొచ్చేది. అయితే వరుసగా ఫ్లాపులు పడ్డాయి. సొంత నిర్మాణంలో తీసిన ‘అశ్వద్దామ’ కూడా బాగా నిరాశ పరిచింది. దాంతో ఓన్ బ్యానర్ జోలికి మళ్లీ పోలేదు. ఆమధ్య వచ్చిన ‘రంగబలి’ తో తేరుకోలేకపోయాడు. గత వారం విడుదలైన ‘బ్యాడ్ బోయ్ కార్తీక్’ అయితే మరీ దారుణం. ఈ సినిమాకు అత్యంత దారుణమైన రివ్యూలు వచ్చాయి. ఈమధ్య కాలంలో ఒకటి కంటే తక్కువ రేటింగ్ ఇచ్చిన సినిమా ఇదే కావొచ్చు. నిర్మాతలు కనీసం పబ్లిసిటీ కూడా చేసుకోలేకపోయారు. సినిమా విడుదలైన సంగతి కూడా చాలామందికి తెలీదు. చాలా డక్కా ముక్కీలు తిని, రిలీజ్ అయిన సినిమా ఇది. నిర్మాత బలవంతంపై నాగశౌర్య ప్రమోషన్లకు వచ్చాడు. లేదంటే ఆ మాత్రం కూడా కనిపించేవాడు కాదు.
చేతిలో ఉన్న సినిమా కూడా వచ్చి వెళ్లిపోయాక… నాగశౌర్య పరిస్థితి మరింత ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు తన చేతిలో సినిమాల్లేవు. హీరోల కొరత ఉన్నా కూడా నాగశౌర్య వైపు చూడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాగశౌర్య ఎలంటి స్టెప్ వేస్తాడన్నది ఆసక్తికరం. ఇప్పుడు సొంతంగా ఓ మంచి కథ వెదుక్కొని, సొంత నిర్మాణ సంస్థలో సినిమా తీసి, హిట్టు కొడితే తప్ప.. ఇండస్ట్రీ చూపు తనవైపు పడదు. మరి ఈ రిస్క్ తీసుకోవడానికి శౌర్య సిద్ధంగా ఉన్నాడో.. లేదో కాలమే చెప్పాలి.
