తెలంగాణ రాజకీయంలో కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, ఒక ఎన్నికల అస్త్రంగా మారింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించాయి. స్వయంగా కేంద్ర మంత్రులు పార్లమెంట్ వేదికగా ఈ గణాంకాలను ప్రస్తావించగా, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు అధికారంలోకి రాగానే బాధ్యుల నుంచి డబ్బులు కక్కిస్తామని హామీ ఇచ్చారు. అయితే, అధికార మార్పిడి జరిగి రెండున్నరేళ్లు గడిచినా, ఆ నినాదాలు క్షేత్రస్థాయిలో చర్యలుగా మారలేదు. కానీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.
బీజేపీపైకి తోసేసి తప్పుకున్న కాంగ్రెస్
కాళేశ్వరంలో అక్రమాలకు విచారణ అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్ విచారణ నిర్వహించి రిపోర్టు ఇచ్చింది. రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం తమ తదుపరి చర్యలు తీసుకోవడానికి కాకుండా..నేరుగా సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసి కామ్‌గా కూర్చుంది. సాంకేతిక లోపాలు, డిజైన్ వైఫల్యాలు , నిధుల మళ్లింపుపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ.. విచారణ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుంది. సీబీఐ విచారణకు కోర్టు అడ్డంకులు లేవు. కానీ కమిటీ నివేదిక చెల్లుబాటుపై కోర్టు తీర్పు చెప్పనుంది. కోర్టులు అనుమతించినా, రాజకీయ సంకల్పం లేనిదే వ్యవస్థలు కదలవనేది అందరికీ తెలిసిన విషయం. కోర్టు తీర్పు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.
కాంట్రాక్టర్లు చాలా పవర్ ఫుల్
కాళేశ్వరం విచారణ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం ఆ ప్రాజెక్టు వెనుక ఉన్న బడా కాంట్రాక్టర్ల వ్యవస్థ అనేది అందరికీ తెలిసిన విషయం. దేశంలోని అత్యంత శక్తివంతమైన నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సంస్థ యజమానులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఆయా పార్టీల అధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలో సిద్ధహస్తులు. ఎన్నికల నిధుల నుంచి ఇతర రాజకీయ అవసరాల వరకు ఈ కార్పొరేట్ శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా విచారణలు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతాయి.
ప్రజా ధనం – రాజకీయ లాభం
ఒకవైపు వేల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అయిందని ,పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నా.. ఆ సొమ్మును రికవరీ చేసే దిశగా కనీస ప్రయత్నాలు జరగడం లేదు. కానీ, ప్రతి ఎన్నికల సమయంలోనూ కాళేశ్వరం పేరుతో ప్రజలను భావోద్వేగానికి గురిచేసే ప్రయత్నాలు మాత్రం ఆగవు. నిధులు దోచుకున్నారు , జైలుకు పంపుతాం అనే నినాదాలు ప్రజల్లో ఒక రకమైన ఆశను, ఆగ్రహాన్ని రగిలిస్తాయి. ఈ భావోద్వేగాలను ఓట్లుగా మార్చుకోవడంలో రాజకీయ పార్టీలు విజయం సాధిస్తున్నాయి . విచారణలు సాగవు, శిక్షలు పడవు, పోయిన డబ్బు తిరిగి రాదు. మిగిలేదల్లా ప్రజల పిచ్చివాళ్లను చేసే రాజకీయ ప్రసంగాలు మాత్రమే. వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే బడా శక్తులు ఉన్నంత కాలం, ఇలాంటి మెగా ప్రాజెక్టుల విచారణలు కేవలం ఎలక్షన్ స్టంట్లు గానే మిగిలిపోతాయనేది చేదు నిజం.


