ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా ఒక వెలుగు వెలిగిన వెంకట్రామిరెడ్డి గారికి ఇప్పుడు మాజీ అనే ట్యాగ్ లైన్ శాశ్వతమైపోయింది. వైసీపీ కోసం, ముఖ్యంగా జగన్ కోసం ఉద్యోగ నిబంధనలను తుంగలో తొక్కి మరీ ఆయన చూపిన అతి విధేయత చివరకు ఆయన ఉద్యోగాన్నే బలి తీసుకుంది. దాదాపు 15 ఏళ్ల సర్వీసు, రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. పాపం, సర్కారు కొలువులో ఉంటూనే పార్టీ క్యాడర్ కంటే ఎక్కువగా కష్టపడినందుకు ఆయనకు దక్కిన ఫలితం.. రోడ్డున పడటం! ఇప్పుడు ఆయన త్యాగానికి ప్రతిఫలంగా జగన్ గారు ఇచ్చే భరోసా ఏమిటన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
వెంకట్రామిరెడ్డి ఉద్యోగం పోగానే వైసీపీ అగ్రనేతల నుంచి ట్విట్టర్ వేదికగా సానుభూతి వర్షం కురుస్తోంది. దానికి తోడు, ఎప్పటిలాగే పొన్నవోలు లాంటి లాయర్లను రంగంలోకి దించి కేసులు నడిపిస్తే అది గొప్ప సాయం అనిపించుకోదు. తన కోసం తన సర్వీసునే పణంగా పెట్టిన వ్యక్తికి, కేవలం లీగల్ సాయం భరిస్తే సరిపోదు. కోర్టుల చుట్టూ తిరగడం అంటే అది మరో పదేళ్ల ప్రహసనమే. అందుకే, జగన్ నిజంగానే ఆయన త్యాగానికి విలువ ఇవ్వాలనుకుంటే, కేవలం ట్వీట్లతో సరిపెట్టకూడదు.
వెంకట్రామిరెడ్డి ఇప్పుడు పక్కాగా రాజకీయ నిరుద్యోగి. ఆయనకున్న ఏకైక దారి.. వైసీపీ జెండా పట్టుకుని జగన్ నీడలో చేరడం. జగన్ తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న నేతకు నిజమైన భరోసా ఇవ్వాలంటే.. ఆయనకు ఒక ఎమ్మెల్సీనో, ఎంపీనో లేదా ఎమ్మెల్యే సీటో కట్టబెట్టాలి. అప్పుడే ఆయన పదిహేనేళ్ల సర్వీసు పోయినా, మరో ఐదేళ్ల రాజభోగం దక్కిందని ఆయన అనుచరులు సర్దిచెప్పుకుంటారు. అలా కాకుండా కేవలం నైతిక మద్దతు అని సరిపెడితే, రేపు ఏ ఉద్యోగి కూడా పార్టీ కోసం త్యాగాలు చేసే రిస్క్ తీసుకోరు.
రాజకీయాల్లో వాడుకోవడం అనేది సర్వసాధారణం. కానీ వెంకట్రామిరెడ్డి విషయంలో అది ఓవర్ యూసేజ్ స్థాయికి వెళ్లింది. ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగిగా ఉండి పార్టీ కార్యకర్తలా వ్యవహరించినందుకు ప్రభుత్వం వేసిన కొరడా దెబ్బకు జగన్ రాజకీయ మందు పూస్తారా లేక న్యాయపోరాటం చేసుకో తమ్ముడూ అని చేతులెత్తేస్తారా అన్నది చూడాలి.
