తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని సంబోధించడం ద్వారా తమిళ ఓటర్లను ఆకట్టుకోవాలని ఖర్గే భావించినట్లు కనిపిస్తోంది. అయితే, రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు కాకుండా, ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. గతంలో ప్రధానిని ఉద్దేశించి చేసిన మౌత్ కా సౌదాగర్ , చాయ్ వాలా , చౌకీదార్ చోర్ హై వంటి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు రాజకీయంగా తీవ్ర నష్టాన్ని కలిగించడమే కాకుండా, బీజేపీకి ఆయుధాలుగా మారాయి.
ఖర్గే వ్యాఖ్యలు వెలువడిన కొద్ది నిమిషాల్లోనే బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. ప్రధానిని ఉద్దేశించి టెర్రరిస్ట్ అనే పదాన్ని వాడటం అంటే 140 కోట్ల మంది భారతీయులను అవమానించడమేనని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా దీనిని ఒక ప్రధాన అస్త్రంగా మార్చేందుకు బీజేపీ సిద్ధమైంది. ప్రధాని పట్ల కాంగ్రెస్ నాయకత్వానికి ఉన్న ద్వేషాన్ని ఇది బయటపెడుతోందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతను ఉగ్రవాదితో పోల్చడం ద్వారా కాంగ్రెస్ తన స్థాయిని దిగజార్చుకుందని విమర్శిస్తున్నారు.
తమిళనాడులో ద్రవిడ సెంటిమెంట్‌ను, హిందీ వ్యతిరేకతను వాడుకోవాలని చూస్తున్న కాంగ్రెస్-డీఎంకే కూటమికి, ఖర్గే మాటలు ఏ మేరకు మేలు చేస్తాయన్నది సందేహమే. దశాబ్దాలుగా ఉగ్రవాద బాధితురాలిగా ఉన్న దేశంలో, ప్రధానిని ఆ పదంతో పిలవడం సగటు ఓటరుకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు బీజేపీకి సానుభూతిని తెచ్చిపెట్టే అవకాశం ఉందని, తటస్థ ఓటర్లు కాంగ్రెస్ వైఖరిపై విముఖత చూపే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
