పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓటమిని అంగీకరించడానికి నిరాకరిస్తూ, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయినప్పటికీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె తెగేసి చెప్పారు. మేము ఓడిపోలేదు.. బీజేపీ వందకు పైగా సీట్లను ఈవీఎంల ద్వారా చోరీ చేసింది అని ఆమె ఆరోపిస్తున్నారు. కే
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విలేకరుల సమావేశంలో మమత అత్యంత ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజలు మాకే ఓటేశారు, కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఒక విలన్లా వ్యవహరించి బీజేపీకి విజయాన్ని కట్టబెట్టింది. ఈవీఎంల ఛార్జింగ్ 90 శాతం ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు. ఈ ఎన్నికలను అక్రమ, అసాధారణ ఎన్నికలుగా ఆమె అభివర్ణించారు. ఫలితాలను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్న ఆమె, అప్పటివరకు పదవిలోనే ఉంటానని సంకేతాలిస్తున్నారు.
సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడగానే మెజారిటీ రాని పక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రులు రాజీనామా చేస్తారు. మమత రాజీనామా చేయకపోతే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. మెజారిటీ లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం అసాధ్యం. ఇలాంటి సమయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. మంత్రివర్గాన్ని రద్దు చేయమని గవర్నర్ కోరవచ్చు, ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం పడిపోయిందని స్పష్టమైనప్పుడు, గవర్నర్‌కు ఆ ముఖ్యమంత్రిని తొలగించే అధికారం రాజ్యాంగబద్ధంగా ఉంటుంది.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓటమి తర్వాత రాజీనామా చేయనని మొండికేసిన ముఖ్యమంత్రులు దాదాపు లేరు. మమత తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీ-టీఎంసీ మధ్య పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. మే 9న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటుండగా, మమత తన నిరసనను ఏ విధంగా కొనసాగిస్తారనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని అంశం.
