ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తరచూ వైసీపీకి, జగన్‌కు క్రెడిట్ చోరీ డిసార్డర్ సోకిందని విమర్శలు గుప్పిస్తూంటారు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం సాధించిన విజయాలను తామే చేశామని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ చోరీ డిసార్డర్ ముదిరి పాకాన పడింది. రాష్ట్రంలో 11 సీట్లకు పరిమితమై, కనీసం సొంత మండలం జడ్పీటీసీ స్థానంలో డిపాజిట్ దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్న వైసీపీ.. ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులో ‘దళపతి’ విజయ్ సాధించిన విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి పడుతున్న పాట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు. గెలిచింది విజయ్ అయితే, ఆ క్రెడిట్ మొత్తం తమ నాయకుడు జగన్ రెడ్డిదేనని వైసీపీ సోషల్ మీడియా సైన్యం చేస్తున్న హడావిడి అంతుచిక్కడం లేదు.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఎవరో అభిమాని ఇచ్చిన జగన్-విజయ్ ఫోటోను విజయ్ కేవలం రెండు సెకన్ల పాటు పైకి ఎత్తి చూపారు. అంతే.. ఆ చిన్న క్లిప్పును పట్టుకుని జగన్ ఫోటో చూపించబట్టే విజయ్ సీఎం అయ్యారు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం చూస్తుంటే, వారి అతివిశ్వాసం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. పక్క రాష్ట్రంలో జగన్ ఫోటో చూసి ఓట్లు వేస్తారనుకోవడం.. కనీస ఇంగితం ఉన్న ఎవరూ ఊహించలేరు.
ముఖ్యంగా మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు ఈ కామెడీని పీక్స్‌కు చేర్చాయి. ఎన్నికల వేళ డీఎంకే తరఫున ప్రచారం చేసి, ఫలితాలు రాగానే విజయ్ మా జగన్ అన్నను ఫాలో అయ్యారు.. అందుకే గెలిచారు అని ప్లేట్ ఫిరాయించేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సొంత రాష్ట్రంలో ప్రజలు తిరస్కరించినా, పొరుగు రాష్ట్రంలో ఎక్కడో ఎవరికో విజయం దక్కితే దాన్ని తమ నాయకుడికి ఆపాదించడం చూస్తుంటే, వైసీపీ నాయకత్వం తీవ్రమైన ఆత్మ న్యూనతా భావంలో ఉన్నట్లు కనిపిస్తోంది. పక్క రాష్ట్రం ఎన్నికల గెలుపు క్రెడిట్ ను కూడా కొట్టేసే ఈ అలవాటును చూస్తుంటే, రేపు అమెరికాలో ఎవరు గెలిచినా వారు జగన్ గారి బటన్ నొక్కుడు పథకాన్ని చూసే గెలిచారు అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు ఎగతాళి చేస్తున్నారు. అయినా వారు మారే చాన్స్ లేదు. ఎందుకంటే.. పైనుండే లీడర్ అలాంటివాడే మరి.
