విశాఖపట్నం కేంద్రంగా సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న దక్షిణ మధ్య తీర రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. జూన్ 1 నుంచి ఈ కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయని వివరిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విభజన చట్టంలోని హామీల అమలులో భాగంగా, విశాఖ కేంద్రంగా ఈ జోన్‌ను ఏర్పాటు చేస్తూ రైల్వే బోర్డు ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులను పూర్తి చేసింది. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరడమే కాకుండా, ప్రాంతీయ రవాణా వ్యవస్థలో పెను మార్పులు రానున్నాయి.
ఈ కొత్త జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్లోని కొంత భాగాన్ని విలీనం చేయనున్నారు. విశాఖపట్నంలోని వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి, దాన్ని రెండుగా విభజించనున్నారు. ఒక భాగాన్ని కొత్తగా ఏర్పడే రాయగడ డివిజన్లో కలిపి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంచుతారు, మరో భాగాన్ని విజయవాడ డివిజన్లో విలీనం చేసి దక్షిణ మధ్య తీర రైల్వే పరిధిలోకి తీసుకువస్తారు. జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలోనే ఉండనుంది, దీని కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన. భవనాల నిర్మాణానికి ఇప్పటికే నిధులు కేటాయించారు. పనులు ప్రారంభమయ్యాయి.
జూన్ 1 నుంచి జోన్ అమల్లోకి రానుండటంతో, కొత్త రైలు సర్వీసుల ప్రారంభం, రైల్వే రిక్రూట్మెంట్లు , ఇతర పరిపాలనాపరమైన నిర్ణయాలు విశాఖ నుంచే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ఇకపై సొంత జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల పట్ల అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. జోన్ ఏర్పాటుతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునీకరణ ,ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయి.
