తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న హంగ్ వాతావరణం ఒక సరికొత్త వ్యూహాత్మక చదరంగానికి తెరలేపింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే కు, డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ మద్దతు పలికింది. ఇతర పార్టీలు వామపక్షాలు, విసికె, ముస్లిం లీగ్ మద్దతు ప్రకటించే దిశగా అడుగులు పడుతుతున్నాయి. ఈ మద్దతు వెనుక ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఉన్నారు. ఆయన ఓకే అంటేనే మద్దతిస్తామనిఈ పార్టీలు ప్రకటించాయి. స్టాలిన్ కూడా ఎన్నికలు కోరుకోవడం లేదు కాబట్టి ఓకే అంటారు. ఎప్పుడు తనకు పరిస్థితి అనుకూలంగా ఉందనుకుంటే.. అప్పుడు మద్దతు లాగేస్తారు.
స్టాలిన్ ‘గ్రీన్ సిగ్నల్’ – వ్యూహాత్మక ఎత్తుగడ
తన మిత్రపక్షాలు విజయ్ వైపు వెళ్తుంటే స్టాలిన్ అడ్డుకోకపోవడం వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది. నేరుగా బీజేపీ లేదా అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవడంతో పాటు, విజయ్ను తమ రిమోట్ కంట్రోల్ పరిధిలోకి తెచ్చుకోవాలని డీఎంకే భావిస్తోంది. విజయ్ ప్రభుత్వం మనుగడ సాగించాలంటే నిరంతరం డీఎంకే మాజీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అంటే, తెరపై విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నా, వెనుక నుంచి చక్రం తిప్పేది మాత్రం స్టాలిన్ నాయకత్వమే.
రిమోట్ కంట్రోల్ పాలన – విజయ్‌కు ముప్పు?
సంకీర్ణ ధర్మం పేరుతో కాంగ్రెస్ లేదా ఇతర చిన్న పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. డీఎంకే డైరెక్షన్లో ఈ పార్టీలు గనుక విజయ్ నిర్ణయాలను అడ్డుకుంటే, ఆయన స్వతంత్ర నాయకత్వం ప్రశ్నార్థకమవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో విజయ్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే, దానిని సాకుగా చూపి మిత్రపక్షాలను మళ్లీ తమ గూటికి రప్పించుకోవడం డీఎంకేకు పెద్ద కష్టమేమీ కాదు. ఈ క్రమంలో విజయ్ రాజకీయంగా ఒంటరి అయిపోవడమే కాకుండా, తన ఇమేజ్ను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
బలహీనమైన పునాదిపై ప్రభుత్వం
విజయ్ ప్రభుత్వం తన కాళ్లపై తాను నిలబడకుండా, ప్రత్యర్థి కూటమి పార్టీల దయాదాక్షిణ్యాలతో ఏర్పడటం ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద సవాలు. డీఎంకే వ్యూహం ప్రకారం.. విజయ్ గ్రాఫ్ తగ్గుతోందని భావించిన వెంటనే ఈ పార్టీలు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కుప్పకూలుతుంది. అప్పుడు అనుభవం లేని నాయకత్వం వల్ల రాష్ట్రం నష్టపోయింది అనే నిందను విజయ్ పైకి నెట్టి, మళ్లీ పగ్గాలు చేపట్టాలని డీఎంకే యోచిస్తోంది. ఇది విజయ్ను కేవలం ఒక ట్రాన్సిషనల్ ముఖ్యమంత్రిగా మిగిల్చే కుట్ర అని టీవీకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
విజయ్ చాణక్యం పనిచేస్తుందా?
స్టాలిన్ వేసిన ఈ ట్రాప్ నుంచి విజయ్ ఎలా బయటపడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షాలను తన దారిలోకి తెచ్చుకుని, డీఎంకే రిమోట్ కంట్రోల్ నుండి విముక్తి పొందితేనే విజయ్ అసలైన విజేత అవుతారు. అలా కాకుండా కేవలం పీఠం కోసం స్టాలిన్ వ్యూహంలో పావుగా మారితే, తమిళనాట విజయ్ రాజకీయ ప్రస్థానం గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు.
