భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ల్యాండ్ దందాలు చేశారని, ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం స్వయంగా తనకే ఫోన్లు చేసేవారంటూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా, తాము చెప్పిన మాట వినని పోలీసు అధికారులను బదిలీ చేయాలని, ఎమ్మార్వోలను తప్పించాలని ఒత్తిడి తెచ్చేవారంటూ మీడియా ముందే కేటీఆర్ ఈ విషయాలను ఒప్పుకోవడం ఇప్పుడు గులాబీ శ్రేణులను సైతం ఆత్మరక్షణలో పడేసింది.
అందరూ చేసేదే..తమ వాళ్లను నిందించడం ఎందుకు?
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతను, వ్యూహాత్మక లోపాలను ఎత్తిచూపుతున్నాయని అనుకోవచ్చు. కేటీఆర్కు ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పరిజ్ఞానం, పొలిటికల్ తెలివితేటలు రాలేదనడానికి ఈ వ్యాఖ్యలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయని సొంతనేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ నేతలైనా స్థానిక సంస్థల బదిలీలు, భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం రాజకీయాల్లో ఒక భాగమైపోయింది. చట్టాల ప్రకారం వెళ్తే వాటి గురించి మర్చిపోవాల్సిందే. అందుకే అధికారంతో పరిష్కరించుకోవాలనుకుంటారు. అందుకే వారి దగ్గరకువస్తారు. నేతలు కూడా సాయం చేస్తారు. చేయకపోతే పార్టీ కోసం ఎవరు పని చేస్తారు?
అవి తప్పు అయితే ఎందుకు చేయనిచ్చారు ?
ఇప్పుడున్న అధికార పార్టీ నేతలు గానీ, గతంలో పనిచేసిన వారు గానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు.. కేవలం తమ పార్టీ వాళ్లే తప్పు చేశారన్నట్లుగా బహిరంగంగా అంగీకరించడం కేటీఆర్ చేసిన పెద్ద తప్పుగా విస్తున్నారు. ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే.. సదరు ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు, స్వయంగా కేటీఆర్కే ఫోన్లు చేసి సెటిల్మెంట్లు అడిగినప్పుడు.. అప్పట్లోనే వారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు వెనకేసుకొచ్చారు? నాడు అధికారాన్ని అనుభవించి, వారి ద్వారా పనులు చేయించుకుని, ఇప్పుడు అధికారం కోల్పోయాక బహిరంగంగా నిందించడం ఏ రకమైన రాజకీయం అనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ మరింత బలహీనపడటమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
కేటీఆర్ ..ఇంకా చాలా నేర్చుకోవాలి!
రాజకీయాల్లో రాణించాలంటే ముందుగా నాయకుడు తన సొంత పార్టీ నేతలను నమ్మడం ప్రారంభించాలి, ఆ తర్వాత తనను తాను నమ్ముకోవాలి. సమకాలీన రాజకీయాలను రాజకీయాలుగానే ఎదుర్కోవాలే తప్ప.. ఇలాంటి పసలేని ఆరోపణలతో సొంత గూటిపైనే విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే అది కేవలం టైంపాస్ వ్యవహారంగానే మిగిలిపోతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఇప్పటికైనా ఇటువంటి పలాయనవాద వ్యాఖ్యలు మానుకొని, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేయకపోతే, భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సొంత పార్టీ సీనియర్ నేతలు ఇండైరక్ట్గా చెబుతున్నారు.
