సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసు విచారణ నేపథ్యంలో ఒక అనూహ్యమైన, తీవ్రమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కొందరు సోషల్ మీడియా వేదికగా ఏకంగా న్యాయవ్యవస్థపైనే దాడికి దిగిన అంశంపై కేసు నమోదు అయింది. వెకేషన్ బెంచ్‌లో ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవి దేవిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కొన్ని ఐటీ సెల్స్, సోషల్ మీడియా ఖాతాలలో తీవ్రమైన నిరాధార ఆరోపణలతో కూడిన పోస్టులను సర్క్యులేట్ చేయడం తీవ్ర కలకలం రేపింది.
బండి భగీరథ్‌కు గనుక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే.. దానికి ప్రతిఫలంగా జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ ఒక రాజకీయ పార్టీకి చెందిన ఐటీ సెల్ , సోషల్ మీడియా విభాగం తీవ్రమైన దుష్ప్రచారం నడిపినట్లు ఆధారాలు లభించాయి. ఈ సోషల్ మీడియా పోస్టులపై విచారణ ప్రారంభంలోనే జస్టిస్ మాధవి దేవి కోర్టు హాల్లోనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన నిష్పాక్షికతను శంకించేలా చేసిన ఈ స్మియర్ క్యాంపెయిన్ తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొంటూ.. బాధితురాలి తరపు న్యాయవాదికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తానే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. అయితే న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణ కొనసాగించిన న్యాయమూర్తి, భగీరథ్‌కు ఎలాంటి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.
నిష్పక్షపాతంగా తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను మానసికంగా దెబ్బతీసేందుకు, వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఇటువంటి చౌకబారు ప్రయత్నాలను హైకోర్టు యంత్రాంగం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ అవాస్తవ ప్రచారాల వల్ల న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై సాధారణ ప్రజల్లో అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉందని గుర్తించిన హైకోర్టు రిజిస్ట్రార్ బి.ఎస్. చిరంజీవి చార్మినార్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చార్మినార్ పోలీసులు తక్షణమే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత లోని పబ్లిక్ సర్వెంట్‌ను విధులను నిర్వర్తించకుండా ఆటంకపరచడం, కోర్టు ధిక్కరణకు పాల్పడటం, వ్యక్తిత్వ హననం, ఐటీ చట్టాలలోని పలు కఠిన సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఈ కేసులో ఒక రాజకీయ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినట్లు తెలుస్తుండటంతో, సదరు ఐటీ సెల్ నిర్వాహకులకు ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురుకానుంది. ఇది సాధారణ రాజకీయ విమర్శ కాదు, ఏకంగా ఉన్నత న్యాయస్థానానికి సంబంధించిన విషయం కాబట్టి, సదరు ట్రోలర్స్ , ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేసేందుకు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. పోలీసులు ఈసారి అత్యంత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
