తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ సరికొత్త పంథాను అనుసరిస్తోంది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వంటి నేతలు అనుసరిస్తున్న బూతుల రాజకీయం ఇప్పుడు ఆ పార్టీని ఎటు తీసుకెళ్తుందో ఎవరికీ అర్థంకావడం లేదు. కేటీఆర్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వాడుతున్న భాషా శైలిని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో కానీ, పాడి కౌశిక్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఆయన బాడీ లాంగ్వేజ్‌లో కనిపించే అతి దూకుడు వివాదాస్పదమవుతూనే ఉంటుంది.
అతి చేయడమే రాజకీయం అనుకునే పాడి
పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. గతంలో పోలీసు అధికారులపై బహిరంగంగా విరుచుకుపడటం, వారిని బెదిరించే ధోరణిలో మాట్లాడటం వంటి ఘటనలు ఆయనపై అతి చేస్తున్నారనే ముద్రను వేశాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్లడం.. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితంపై దారుణమైన ఆరోపణలు చేయడం లాంటివి కూడా చేశారు. అందుకే బండి సంజయ్ అనుచరుల నుండి ప్రతిఘటన ఎదురైనప్పుడు కూడా, దానిని సానుభూతిగా మార్చుకోలేకపోయారు. రాజకీయాల్లో విమర్శ అనేది ప్రత్యర్థిని ఆలోచింపజేసేలా ఉండాలి కానీ, ఎదుటివారు కొట్టినంత పని చేసేలా అసహ్యంగా ఉండకూడదు. కానీ అలా చేయడమే రాజకీయం అనుకుంటున్నారు.
పార్టీ ఇమేజ్‌కు చేటు చేస్తున్న బూతుల ముద్ర
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన అనుభవం ఉన్న పార్టీ. కేటీఆర్ లాంటి విద్యావంతుడు, కౌశిక్ రెడ్డి లాంటి యువ ఎమ్మెల్యేలు ప్రజలకు ఒక రోల్ మోడల్ గా ఉండాలి. కానీ, వారు వాడుతున్న భాష వల్ల తటస్థ ఓటర్లలో పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వంటి ప్రత్యర్థుల్ని తామేమీ చేయలేకపోతున్నామన్న భావన వల్లే వీరు ఇలా బూతులతో దాడి చేస్తున్నారా?” అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. రాజకీయాల్లో సంయమనం లేకపోవడం అనేది బలహీనత కు సంకేతం. బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గ్రహించకుండా, తిట్టడమే అసలైన పోరాటం అనుకోవడం ఆ పార్టీకి స్వయంకృతాపరాధంగా మారే ప్రమాదం ఉంది.
ఆత్మావలోకనం అవసరం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను ఒడిసిపట్టి, నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిన సమయంలో.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చను పక్కదారి పట్టించడం బీఆర్ఎస్కే నష్టం. ప్రభుత్వంపై విమర్శల్లో పదును ఉండాలి కానీ పరుషం ఉండకూడదు. కేటీఆర్ , పాడి కౌశిక్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.
