తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఒక సినిమా స్క్రిప్ట్‌ను మించి ఉత్కంఠను రేకెత్తిస్తుంటాయి. అప్పట్లో జయలలిత మరణం తర్వాత శశికళ చిన్నమ్మ గా పీఠం ఎక్కాలని భావించి, చివరి నిమిషంలో జైలుకు వెళ్లిన ఉదంతం ఒక సంచలనం. ఇప్పుడు నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పరిస్థితి కూడా దాదాపు అదే స్థాయిలో ఉత్కంఠగా మారింది. ఫలితాలు వెలువడిన రోజు ఆయనకు సీఎం ప్రోటోకాల్ దక్కింది. రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోయి మెజారిటీ మార్కుకు పది సీట్ల దూరంలో ఉండిపోవడం తమిళ రాజకీయాల్లో మరో సంక్షోభానికి నాంది పలికింది.
శశికళ తరహాలో చివరి క్షణంలో ఆగిపోయిన ప్రమాణం
విజయ్ పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పది స్థానాల కోసం ఇప్పుడు ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శశికళ విషయంలో అప్పట్లో అక్రమాస్తుల కేసు అడ్డంకిగా మారి ఆమెను జైలు పాలు చేస్తే, విజయ్ విషయంలో బలం అడ్డంకిగా మారింది. ఆయనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేకపోయినప్పటికీ, మెజారిటీ నిరూపించుకోలేకపోవడం వల్ల ప్రమాణ స్వీకార ఏర్పాట్లు నిలిచిపోయాయి. గవార్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సంఖ్యా బలంపై స్పష్టత కోరడంతో విజయ్ అడుగులు వెనక్కి పడ్డాయి.
ఇలాంటి ప్రభుత్వాన్ని నడపడం కంటే తెలివి తక్కువ రాజకీయం ఉండదు!
ప్రస్తుతం తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో చిన్న పార్టీలే నిర్ణాయక శక్తులుగా మారాయి. కాంగ్రెస్ తన 5 స్థానాలతో విజయ్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ, ఇంకా 5 స్థానాల లోటు కనిపిస్తోంది. సీపీఐ, సీపీఎం , వీసీకే వంటి పార్టీలు ఇంకా తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఒకవైపు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ( తన మిత్రపక్షాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా, అన్నాడీఎంకే కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకటి రెండు స్థానాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం అనేది తమిళనాడు వంటి రాష్ట్రంలో అత్యంత సాహసోపేతమైన, బలహీనమైన నిర్ణయం అవుతుంది.
విజయ్ ఇంత బలహీనమా?
తమిళ ఓటరు స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అప్పట్లో శశికళ సీఎం కాకుండా అదృశ్య శక్తులు అడ్డుకున్నాయన్న ప్రచారం సాగగా, ఇప్పుడు విజయ్ విషయంలో కూడా ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉందా అనే చర్చ సాగుతోంది. ఒకవేళ విజయ్ మద్దతు కూడగట్టలేకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి జయలలిత, కరుణానిధి లేని తమిళ రాజకీయాలు ఇప్పుడు నెంబర్ గేమ్ చుట్టూ తిరుగుతూ సగటు ఓటరును అయోమయానికి గురిచేస్తున్నాయి. నేడు రాజకీయ మంతనాలు తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేల్చనున్నాయి.
