ఈ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పరాజయాలు, ఎదుర్కొంటున్న విమర్శలు, ఆటగాళ్ల వైఫల్యాలూ పక్కన పెడితే – కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలు, ఆట తీరే ఎక్కువగా అల్లరి పాలైంది. కెప్టెన్ గానే కాదు, కనీసం ఆటగాడిగా కూడా హార్దిక్ పనికిరాడని ముంబై డై హార్డ్ ఫ్యాన్స్ తరచుగా విమర్శిస్తుంటారు. ఓ ఐపీఎల్ కెప్టెన్ పై ఈ స్థాయి నిరసన ఎప్పుడూ చూడలేదు. దానికి తగ్గట్టే… ఈ ఐపీఎల్ లో చెత్త ప్రదర్శన చేస్తూ వచ్చాడు హార్దిక్. దానికి తోడు జట్టుని విజయపధం వైపు నడిపించలేకపోయాడు. రోహిత్, బుమ్రా, డికాక్, సూర్య కుమార్ యాదవ్, బోల్ట్ ఇలాంటి స్టార్లున్న జట్టు వరుసగా ఓడిపోతోందంటే.. కచ్చితంగా కెప్టెనే కారణం. అందుకే.. ఈ పరాజయాల భారం తనపైనే ఎక్కువగా పడుతోంది. దాంతో హార్దిక్ ని తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించడం మొదలెట్టాయి. సీజన్ మధ్యలో కెప్టెన్ ని తొలగించడం ఏ జట్టుకైనా మంచిది కాదు. కాబట్టి.. ముంబై యాజమాన్యం కూడా మౌనంగా ఉండిపోయింది.
అయితే.. గత మ్యాచ్‌లో అనూహ్యంగా హార్దిక్ కనిపించలేదు. ఆ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచింది. `గాయంతో హార్దిక్ ఈ మ్యాచ్ ఆడడం లేదు` అని సూర్య కుమార్ యాదవ్ చెబుతున్నాడు. ఫామ్ లో లేకపోవడం వల్ల హార్దిక్ తనంతట తాను తప్పుకొన్నాడన్నది క్రీడా వర్గాలు చెబుతున్నమాట. అయితే.. హార్దిక్ తప్పుకోలేదని, బలవంతంగా తప్పించారని, ఈ సీజన్లో హార్దిక్ కనిపించే అవకాశాలే లేవన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. హార్దిక్ కెప్టెన్ అవ్వడం జట్టులో ఎవ్వరికీ ఇష్టం లేదని, అందుకే వాళ్లంతా కెప్టెన్‌కు తగిన సహకారం అందించడం లేదని, ఈ కారణంతోనే టీమ్ ని గాడిలో పెట్టడంలో హార్దిక్ కూడా విఫలం అవుతున్నాడన్న కథనాలు బయటకు వస్తున్నాయి.
నిజానికి రోహిత్ శర్మని కాదని హార్దిక్ కి కెప్టెన్సీ కట్టబెట్టడం పెద్ద సాహసం. అంతకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ చేసిన పాండ్యా.. ఓసారి తన జట్టుకి ఐపీఎల్ ఛాంపియన్ షిప్ తీసుకొచ్చాడు. మరోసారి రన్నరప్ గా నిలిపాడు.మళ్లీ ముంబై జట్టు పిలిచిప్పుడు ‘కెప్టెన్సీ ఇస్తేనే వస్తా’ అనే షరతు విధించాడు. రోహిత్ కూడా దానికి ఒప్పుకోవడంతో ముంబై కెప్టెన్ అయ్యాడు. అయితే రోహిత్ ని కాదని, హార్దిక్ ని కెప్టెన్ చేయడం బుమ్రా, సూర్య లాంటి సీనియర్లకు నచ్చలేదు. దాంతో వాళ్లు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఆ ప్రభావం జట్టు ఆట తీరుపై కూడా పడుతోంది. అందుకే వరుసగా ఇన్ని వైఫల్యాలు చుట్టుముట్టాయి. ఈ తతంగం ముంబై యాజమాన్యం గమనిస్తోంది. అందుకే ఇప్పుడు హార్దిక్ ని తప్పించారని తెలుస్తోంది. కాకపోతే.. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈ ఐపీఎల్ నుంచి ముంబై దాదాపుగా నిష్క్రమించినట్టే. ఇప్పుడు హార్దిక్ ని కాదని ఎవర్ని కెప్టెన్ చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కాకపోతే.. కొద్దో గొప్పో విజయాలతో ఊరడింపు పొందాలన్నది ముంబై యాజమాన్య తాపత్రయం.
