తమిళనాడులో డీఎంకే సర్కార్ ఓడిపోయింది. ఘోరంగా ఏమీ ఓడిపోలేదు. కానీ సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓడిపోవడం అందర్నీ షాక్కు గురి చేసింది. సీఎం తన నియోజకవర్గానికి సహజంగానే భారీగా నిధులు కేటాయిస్తారు. పథకాలు సంతృప్త స్థాయిలో అందిస్తారు. అక్కడా అదే జరిగింది. టీవీకే తరపున గెలిచిన అభ్యర్థి ఏమైనా ముత్యమా అంటే.. కాదు. అయినా స్టాలిన్ను ఎందుకు ఓడించారు అనేది మిస్టరీగా మారిపోయింది. ఈ కోణంలో చేస్తున్న పరిశీలనల్లో అందరికీ కనిపిస్తున్న మొదటి అంశం.. ఓటర్ల జాబితాల ప్రక్షాళన.
కోలత్తూరులో లక్ష ఓట్ల కోత
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2,68,296 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో, 2026 ఎన్నికల నాటికి ఆ సంఖ్య ఏకంగా 2,07,251కి పడిపోయింది. అంటే కేవలం ఐదేళ్ల కాలంలో సుమారు 1.08 లక్షల మంది ఓటర్లను అంటే దాదాపు 35 శాతం ఓటర్లను జాబితా నుండి తొలగించారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో ఓట్ల కోత విధించడం వెనుక ఉన్న మర్మమేమిటనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.
లక్ష ఓట్లను తొలగించి 35 వేల కొత్త ఓట్ల చేర్పు
లక్షకు పైగా పాత ఓటర్లను తొలగించి, 35 వేల మంది కొత్త ఓటర్లను చేర్చారు. ఒకే నియోజకవర్గంలో 35 శాతం ఓటర్లు కనుమరుగు కావడం అనేది భారత ఎన్నికల చరిత్రలోనే అరుదైన ఘటన. సాధారణంగా మరణించిన వారు లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని తొలగిస్తుంటారు, కానీ ఆ సంఖ్య సాధారణంగా 2 నుండి 5 శాతం మించదు. ఇక్కడ మాత్రం మూడవ వంతు కంటే ఎక్కువ మందిని తొలగించడం వెనుక బలమైన కారణాలు ఇప్పటికీ బయటకు రాలేదు.
గతంలో బోగస్ ఓట్లు మెజార్టీగా ఉన్నాయా?
ఈ అంశంపై రెండు ప్రధాన వాదనలు వినిపిస్తున్నాయి. మొదటిది, 2021లో రూపొందించిన జాబితాలో పెద్ద ఎత్తున బోగస్, డూప్లికేట్ లేదా చనిపోయిన ఓటర్ల పేర్లు ఉండి ఉండవచ్చు. ఎన్నికల సంఘం ఇప్పుడు కేవలం వాటిని తొలగించి, జాబితాను పారదర్శకంగా మార్చి ఉండవచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే, గత ఎన్నికల్లో స్టాలిన్ సాధించిన మెజారిటీపై కూడా నైతిక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే తప్పుడు ఓటర్ల అండతోనే గెలుపు సాధ్యమైందనే ఆరోపణలు విపక్షాల నుండి వచ్చే ప్రమాదం ఉంది.
స్టాలిన్ రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు ప్లానా?
ఇది డిఎంకె నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు జరిగిన భారీ కుట్ర అని ఆ పార్టీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే పార్టీ సానుభూతిపరుల ఓట్లను జాబితా నుండి తొలగించారని, తద్వారా 2026 ఎన్నికల్లో ముఖ్యమంత్రికి గడ్డు పరిస్థితులు సృష్టించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం వెనుక ఉన్న శక్తుల వ్యూహమని వారు అనుమానిస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా 35 శాతం ఓట్లు ఒకేసారి మాయం కావడం అనేది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు విరుద్ధమని వారి వాదన.
నిజాలు బయట పెట్టాల్సింది ఎన్నికల సంఘమే!
ఈ ఓట్ల గల్లంతు మిస్టరీ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం తొలగించిన వారు ఎవరు అనే అంశం కీలకం కానుంది. ఒకవేళ ఈ తొలగింపులు అక్రమంగా జరిగాయని తేలితే, అది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అవుతుంది. అలా కాకుండా, గతంలోనే భారీగా బోగస్ ఓట్లు ఉన్నాయని నిరూపితమైతే, అది రాజకీయ పార్టీల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుంది. ఏది నిజం అయినా అది ప్రజలకు తెలిసేలా చేయాల్సింది మాత్రం ఎన్నికల సంఘమే.
