పాన్ ఇండియా అనే కిరీటం తగిలించుకొంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా సినిమాని దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి. ఆ స్థాయిలో ప్రచారం చేయాలి. పాన్ ఇండియా ట్యాగ్ లైన్ తో వస్తున్న చాలా సినిమాలు ఈ విషయంలో విఫలం అవుతున్నాయి. హడావుడిగా సినిమాని పూర్తి చేసి, ఏదో చేశాం అన్నట్టు ప్రమోట్ చేసి, జనంలోకి వదిలేస్తున్నారు. పెద్ద హీరో సినిమా అయితే… తెలుగులో ప్రమోషన్ల గురించి పెద్దగా పట్టించుకోరు. వాళ్లకెలాగైనా టికెట్లు తెగుతాయి. కానీ నార్త్ లో అలా ఉండదు. ఓ సినిమా వస్తోంద్నన విషయాన్ని నార్త్ ప్రేక్షకులకు బలంగా చెప్పగలగాలి. అంత టైమ్ మన తెలుగు పాన్ ఇండియా సినిమాలు తీసుకోవడం లేదు. అందుకే నార్త్ లో వసూళ్లు సాధించే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి.
అప్పట్లో ‘పుష్ప’ కి ఆ స్థాయి వసూళ్లు వచ్చాయంటే కారణం.. నార్త్ లో వాళ్లు చేసిన ప్రమోషన్లే. ఆ తరవాత వచ్చిన ఏ తెలుగు సినిమా, ఆ స్థాయిలో మెరవలోకపోయింది. ఇప్పుడు `పెద్ది` వంతు వస్తోంది. అన్ని రకాలుగా లెక్కలు వేసుకొని జూన్ 4న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్రబృందం. అది టాక్సిక్ డేట్. ఆ సినిమా వాయిదా పడడంతో.. పెద్ది బరిలో దిగడానికి వీలు దక్కింది. పెద్ది ఎనౌన్స్మెంట్ రావడంతో… తెలుగులో మరో సినిమా ఆ డేట్ వైపు చూడడానికి ధైర్యం చేయదు. తమిళ, కన్నడ భాషల్లో ‘పెద్ది’ కి పోటీగా ఏ సినిమా రావడం లేదు. హిందీలోనూ అంతే. వరుణ్ ధావన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతోంది. అది ‘పెద్ది’ కి పోటీ అని చెప్పలేం. సో.. గ్రౌండ్ ఖాళీగా ఉన్నట్టే.
‘పెద్ది’ లాంటి కమర్షియల్ సినిమాలకు నెటివిటీ సమస్య ఉండదు. పైగా ఇదో స్పోర్ట్స్ డ్రామా. క్రికెట్, కబడ్డీ, కుస్తీ.. ఇలా దాదాపుగా అన్ని ఆటలూ ఉంటాయి. అవన్నీ దేశ వ్యాప్తంగా తెలిసిన ఆటలే. అలా చూసినా.. ‘పెద్ది’ ది యూనివర్సల్ సబ్జెక్ట్ అనుకోవొచ్చు. చరణ్ తెలిసిన హీరోనే. ఆర్.ఆర్.ఆర్ బాలీవుడ్ లో అదరగొట్టింది. తుఫాన్ తో అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు చరణ్. జాన్వీ కపూర్ కూడా హిందీ హీరోయిన్నే. అన్నిటికంటే ముఖ్యంగా రెహమాన్ ఉన్నాడు. ఇలా టీమ్ పరంగానూ పక్కాగా కుదిరింది.
కాకపోతే.. కాస్త హంగామా చేయాలి. నార్త్ లో ప్రమోషన్లు ముమ్మరంగా చేయాలి. అది కూడా ప్లాన్ ప్రకారం. ‘పెద్ది’ టీమ్ చేతిలో నెల రోజుల సమయం ఉంది. సరైన ప్రణాళిక వేసుకొంటే, ఈ టైమ్ సరిపోతుంది. ఏదో తూతూ మంత్రంగా ప్రమోషన్లు చేయకుండా చరణ్, జాన్వీ, రెహమాన్ లతో.. పాన్ ఇండియా ట్రిప్ వేయించాలి. నార్త్ బెల్ట్ లో పుష్ప ఎలాగైతే ప్రమోసన్లతో దుమ్ము దులిపిందో, అలా… ‘పెద్ది’ కూడా చేయాలి. అప్పుడు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. టాక్ కూడా తోడైతే.. తెలుగు సినిమా సత్తా ఏమిటో నార్త్ బెల్ట్ కి మరోసారి తెలిసొస్తుంది. మరి.. ‘పెద్ది’ టీమ్ ప్రణాళికలు ఎలా ఉన్నాయో? ఈరోజు నుంచి మాత్రం `పెద్ది` టీమ్ ప్రమోషన్ల పర్వానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. టెక్నికల్ టీమ్ లో కీలకమైన అవినాష్ కొల్లా (ప్రొడక్షన్ డిజైనర్) మీడియా ముందుకు వస్తున్నారు. ఇక ఈ రెండు మూడు వారాల పాటు ఈ ప్రమోషన్ల జాతర కొనసాగే అవకాశం ఉంది. ఇక వినిపించేవన్నీ పెద్ది ముచ్చట్లే.
