హైదరాబాద్ ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో గత మార్చిలో ఏసీబీ దాఖలు చేసిన సుమారు 250 పేజీల ఛార్జిషీట్‌ను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు తాజాగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ , హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్ రెడ్డి సహా మరో ఇద్దరు నిందితులకు కోర్టు నేడు సమన్లు జారీ చేసింది. వీరు కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది.
2024లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు కోసం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ. 55 కోట్ల మేర విదేశీ కరెన్సీని మళ్లించారని ప్రధాన ఆరోపణ. కేబినెట్ , ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ నిధుల బదిలీ జరిగిందని ఏసీబీ తన దర్యాప్తులో నిర్ధారించింది. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ చార్జిషీట్లో పేర్కొంది. దీనిపై ఇప్పటికే గవర్నర్ ,కేంద్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ అనుమతులు మంజూరు చేసిది.
కోర్టు సమన్లు జారీ చేయడం అంటే ప్రాథమికంగా నిందితులపై ఉన్న ఆరోపణల్లో తగిన ఆధారాలు ఉన్నట్లు కోర్టు సంతృప్తి చెందిందని అర్థం. సమన్లలో పేర్కొన్న తేదీన నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ రోజున కోర్టు వారికి ఛార్జిషీట్ కాపీలను అందజేసి, వారిపై ఉన్న అభియోగాలను చదివి వినిపిస్తుంది. ఈ దశలో నిందితులు తాము నిర్దోషులమని వాదించవచ్చు, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ కోర్టు వీటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తే విచారణ ప్రక్రియ వేగవంతం అవుతుంది.
ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగంది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. రాజకీయంగా కూడా ఈ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికే ఈ రేసు నిర్వహించామని కేటీఆర్ వాదిస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇది పక్కాగా జరిగిన నిధుల దుర్వినియోగమేనని స్పష్టం చేస్తోంది.
