అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో గట్టిగా సర్క్యులేట్ అవుతోంది. బన్నీ ముంబైలో ఓ ఖరీదైన ఇల్లు కొన్నారని, త్వరలోనే ఆయన ముంబైకి షిఫ్ట్ అయిపోతారన్నది ఆ వార్తల సారాంశం.
దాంతో బన్నీ ముంబై వెళ్లిపోతారేమో, అక్కడే సెటిల్ అయిపోతారేమో అనే బెంగ అభిమానుల్లో మొదలైంది. ఈ విషయమై అల్లు అర్జున్ సన్నిహితుల్ని తెలుగు 360 ఆరా తీసింది. దాంతో కొత్త విషయాలు బయటకు వచ్చాయి.
అల్లు అర్జున్ ముంబైలో ఇల్లు కొన్నారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. కాకపోతే.. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. ప్రస్తుతం బన్నీ అక్కడే ఉంటున్నారు. కాకపోతే ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే.
అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా కోసం బన్నీ తరచూ ముంబై వెళ్తూ, వస్తున్నారు. ఇటీవల ఆయన బర్త్ డే కోసం హైదరాబాద్ వచ్చారు. రెండ్రోజులు ఉండి మళ్లీ ముంబై వెళ్లిపోయారు. షూటింగ్ కి కాస్త గ్యాప్ వచ్చినా ఆయన హైదరాబాద్ రావడం, ఆ తరవాత తిరిగి వెళ్లిపోవడం జరుగుతున్నాయి. ముంబై వెళ్లినప్పుడల్లా ఆయన ఓ స్టార్ హోటెల్ లో ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా స్టార్ హోటెల్ ఆయనకు ఆవాసం అయిపోయింది. రోజుకు అక్కడ బిల్లు దాదాపు రూ.2 లక్షలకు పైమాటనేనని టాక్. అంతంత అద్దెలు చెల్లించుకోవడం కూడా నిర్మాతకు ఇబ్బందే. పైగా ఎంత లగ్జరీ హోటెల్ అయినా అన్నేసి నెలలు ఉండడం కూడా కష్టమే. కాబట్టి.. ఆయన తాత్కాలిక ఏర్పాటు కోసం ఓ ఇండిపెండెంట్ హౌస్ అద్దెకు తీసుకొన్నారంతే. ‘రాకా’ షూటింగ్ ముగిశాక ఆ ఇల్లు ఖాళీ చేస్తారు. అంతే తప్ప… బన్నీ ఇల్లు కొన్నారన్న వార్తలో ఎలాంటి నిజం లేదు.
ప్రభాస్ కూడా అంతే. ఆయన కు ఇటలీలో ఓ ఇల్లు ఉంది. అది కూడా అద్దె ఇల్లే. షూటింగ్ లేనప్పుడు ఆయన ఇటలీ వెళ్లిపోతుంటారు. మన స్టార్ హీరోల్లో చాలామందికి ముంబైలో ఆవాసాలు ఉన్నాయి. బన్నీ మాత్రం అటువైపు దృష్టి పెట్టలేదు. మరి భవిష్యత్తులో కొంటారేమో చూడాలి.
