అక్కడ స్పేస్ లేదు.. కానీ సృష్టించుకున్నాడు అని ఓ సినిమాలో డైలాగ్. కవిత కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ లేకపోయినా తనకంటూ ఓ స్పేస్ సృష్టించుకునేందుకు రంగంలోకి దిగారు. కొత్త పార్టీని ప్రకటిస్తున్నారు. పేరు ఏదైనా ఆమెది నిఖార్సైన తెలంగాణ భావజాలం. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్నీ జాతీయ పార్టీలే. తనది మాత్రమే అసలైన తెలంగాణ పార్టీ అని కవిత వాదించబోతున్నారు. ఈ రోజు నుంచి కవిత రాజకీయాల లెక్క మారిపోతోంది.
తెలంగాణ అస్తిత్వం – సరికొత్త నినాదం
బీఆర్ఎస్ తన పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత్ రాష్ట్రీయ సమితిగా మార్చుకుని జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన తరుణంలో, రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ ఏర్పడిందని కవిత భావిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ వాదం వినిపిస్తున్నా ప్రజల్లో ఎమోషన్ రావడం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్నీ జాతీయ పార్టీలుగా మారిపోయాయని.. కేవలం తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే ప్రాంతీయ స్వరం వినిపించే పార్టీ అవసరమని ఆమె వాదిస్తున్నారు. తన పార్టీ పేరులో తెలంగాణ ఉండేలా చూసుకోవడం ద్వారా, ప్రజల్లో మళ్లీ ఆ సెంటిమెంట్‌ను రగిలించి తనకంటూ ఒక రాజకీయ స్థానాన్ని సృష్టించుకోవాలని చూస్తున్నారు.
డ్యాడీ, మోడీ, చిన్న మోడీ పై పోరు
కవిత తన రాజకీయ ప్రత్యర్థులపై చాలా స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. డ్యాడీ కేసీఆర్ , మోడీ , చిన్న మోడీ రేవంత్ రెడ్డి లతో రాజీలేని పోరాటం చేస్తానని ఆమె ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్లో తనను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని, తన ఆత్మగౌరవం కోసమే ఈ పోరాటమని చెబుతూ.. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో తనకున్న పట్టును నిరూపించుకోవాలని ఆమె తహతహలాడుతున్నారు. తనది సామాజిక తెలంగాణ లక్ష్యంగా సాగే ప్రయాణమని ఆమె చెబుతున్నారు.
తెలంగాణ జాగృతి నుండి రాజకీయ పార్టీగా..
గత రెండు దశాబ్దాలుగా సాంస్కృతిక సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతి ని ఇప్పుడు ఒక రాజకీయ శక్తిగా మార్చడం ద్వారా, తనకున్న క్యాడర్‌ను ఓటు బ్యాంకుగా మలుచుకోవాలనేది ఆమె వ్యూహం. మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతం , సామాజిక న్యాయం తన పార్టీకి పునాదులని ఆమె పేర్కొన్నారు. యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తామన్న హామీతో కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తానంటున్నారు. అయితే, ఇప్పటికే బలమైన మూడు శక్తులు ఉన్న తెలంగాణలో ఆమె ఎంతవరకు చీల్చగలరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
స్పేస్ దొరుకుతుందా?
రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం లేదా నాలుగో శక్తిగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. కానీ బీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు, రేవంత్ రెడ్డి పాలనపై అసహనంతో ఉన్న వర్గాలను ఆమె ఆకట్టుకోగలిగితే కొంత స్పేస్ దొరికే అవకాశం ఉంది. ప్రత్యేకించి బీసీ రిజర్వేషన్లు, మహిళా హక్కుల వంటి అంశాలపై ఆమె చేస్తున్న పోరాటం ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది. ప్రకటించబోయే పార్టీ పేరు, జెండా , అజెండా ఆమె రాజకీయ బలాన్ని నిర్ణయించబోతున్నాయి.
