నందమూరి బాలకృష్ణతో కొరటాల శివ సినిమా ఓకే అయ్యింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వస్తుంది. 2027 సంక్రాంతి లక్ష్యంగా ఈ సినిమాని పూర్తి చేస్తారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తారు.
అంత వరకూ బాగానే ఉంది. కానీ… ఈలోగా బాలయ్యపై ఆశలు పెట్టుకొన్న ఓ దర్శకుడి పరిస్థితి మాత్రం ‘పాపం…’ అనిపించేలా ఉంది. బాలయ్యకు ఇటీవల కథలు చెప్పిన వాళ్లలో విజయ్ కనకమేడల కూడా ఉన్నారు. `నాంది` సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడీయన. బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశారు. అనుకోకుండా అక్కడ్నుంచి పిలుపొచ్చింది. వెళ్లి కథ చెప్పారు. బాలయ్యకూ బాగా నచ్చింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఈ సినిమాని పట్టాలెక్కించేద్దాం అనుకొన్నారు. దర్శకుడి కోసం ఓ ఆఫీస్ కూడా తెరిచారు. మరో రెండు రోజుల్లో పూజ చేసుకొని, ఆఫీసులోకి ఎంటర్ అవ్వాలి. ఈలోగా.. దర్శకుడు మారిపోయాడు. కొరటాల శివ లైన్లోకి రావడం, కథ ఓకే చేసుకోవడం జరిగిపోయాయి. దాంతో విజయ్ కనకమేడల కన్న కలలు పేక మేడల్లా కుప్ప కూలిపోయాయి. బాలయ్యతో సినిమా ఉంటుందా, లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బాలయ్య చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నట్టు లెక్క. అవి పూర్తయ్యేంత వరకూ మరో సినిమా మొదలవ్వదు. ఈలోగా ఏమైనా జరగొచ్చు.
నిజానికి బాలయ్య- విజయ్ కనకమేడల కాంబో ఎవరూ ఊహించలేదు. సడన్ గా లైన్ లోకి వచ్చింది. అంతే సడన్ గా పక్కకు వెళ్లిపోయింది. బ్యాడ్ లక్ అంతే.


