ఎట్టకేలకు ‘పెద్ది’ ఐటెమ్ పాటకు సంబంధించిన సస్పెన్స్ వీడింది. ఈ పాటలో కనిపించే స్టార్ హీరోయిన్ ఎవరన్న ఉత్కంఠతకు తెర పడింది. ‘పెద్ది’ లో ఐటెమ్ పాటకు గానూ.. శ్రుతిహాసన్ పేరు ఖరారైంది. ఆదివారం నుంచే ఈ పాటని తెరకెక్కించబోతున్నారు. హైదరాబాద్ శివార్లలో రూపొందించిన ప్రత్యేకమైన సెట్లో నాలుగు రోజుల పాటు ఈ పాటని తెరకెక్కిస్తారు. దాంతో షూటింగ్ పూర్తవుతుంది.
‘పెద్ది’ సినిమాలో ఐటెమ్ పాట కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. ఓ దశలో మృణాల్ ఠాకూర్ పేరు ఖాయం అనేసుకొన్నారు. ‘కపుల్ ఫ్లెండ్లీ’ తో ఎంట్రీ ఇచ్చిన మానస వారణాసి పేరు కూడా గట్టిగానే వినిపించింది. అయితే చివరికి… శ్రుతిహాసన్ ని ఎంచుకొన్నారు. ఈ పాట కోసం శ్రుతికి పెద్ద మొత్తంలోనే పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. అదెంత అనే విషయంలో ఓ క్లారిటీ రావాల్సివుంది.
జూన్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. జూన్ లోనే పెద్ది రిలీజ్ ఉంటుందంటూ చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. అయితే విడుదల తేదీ మాత్రం ఖరారు చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం జూన్ 25న ఈ సినిమా రావడం పక్కా అనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ రెండు పాటలు విడుదలయ్యాయి. రెండూ చాట్ బస్టర్లే. ఈ ఐటెమ్ పాట కూడా అదరిపోయేలా వచ్చిందని సమాచారం. పెద్ది నుంచి త్వరలో ఓ డ్యూయెట్ రాబోతోంది. ఆఖరి పాటగా ఐటెమ్ సాంగ్ ని విడుదల చేసే అవకాశం ఉంది.
