కల్వకుంట్ల కవిత ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సేన.. టీఆర్ఎస్ పార్టీపై భారత రాష్ట్ర సమితి స్పందన పేలవంగా ఉంది. తమది ఒరిజినల్ అని.. కవితది డూప్లికేట్ అని చెప్పేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ఓ ట్వీట్ పెట్టారు. కానీ కవిత పెట్టిన టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ ఎప్పుడూ లేదు. టీఆర్ఎస్ కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. అప్పుడు టీఆర్ఎస్కు .. తెలంగాణ రాష్ట్ర సేన డూప్లికేట్ అయ్యే అవకాశం లేదు. వారు పోగొట్టుకున్నదాన్ని కవిత తెచ్చుకున్నారని అనుకోవచ్చు.
మరికొంత మంది నేతలు తమ పార్టీ క్యాడర్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి.. ఏ మాత్రం కంగారు పడకండి కార్యకర్తలారా..ఆ పేరును ఈసీ అనుమతించదని పోస్టు పెట్టారు. ఆయనకు చాలా మంది కౌంటర్స్ ఇస్తున్నారు ఎన్నికల సంఘం అనుమతించనంత నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ లేదు. తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుకు తగ్గ పార్టీ మరొకటి లేదు. ఎన్నికల సంఘం.. టీఆర్ఎస్ పేరును పరిగణనలోకి తీసుకున్నా ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీ లేదు.
బేలగా ఉన్న ఇలాంటి రియాక్షన్సే తప్ప.. ఆ పార్టీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి .. కవిత చేసిన ఆరోపణలకు స్పందిస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. గతంలో ఆరోపణలు చేసినప్పుడు చాలా మంది నేతలు..మహిళా నేతలు ప్రెస్మీట్లు పెట్టి విమర్శించారు. అయితే కవితపై విమర్శలు చేయడం అంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా రివర్స్ అవుతుంది. అందుకే పార్టీ పెద్దల నుంచి సూచనలు , స్క్రిప్ట్ వస్తే తప్ప బీఆర్ఎస్ నేతలు నేరుగా స్పందించే అవకాశాలు లేవని అనుకోవచ్చు.
