అంచనాల్లేకుండా వచ్చిన కొత్త పార్టీతో వచ్చిన కల్వకుంట్ల కవిత తన ఆవిర్భావ స్పీచ్ తోనే అంచనాలు పెంచేశారు. తాను అంత ఆషామాషా నాయకురాలిని కాదని .. కేసీఆర్ కు అప్ డేటెడ్ వెర్షన్ ను అని నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. మేడ్చల్ వేదికగా జరిగిన తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత తన ప్రసంగంతో రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచారు. కేవలం భావోద్వేగాలకే పరిమితం కాకుండా, అత్యంత ప్రణాళికాబద్ధంగా తండ్రి కేసీఆర్ రాజకీయ చతురతకు, ఆధునిక ఆలోచనా దృక్పథాన్ని జోడించి తానొక అప్డేటెడ్ వెర్షన్ అని నిరూపించుకున్నారు. ఈ సభలో ఆమె పాంచజన్యం పేరుతో ఐదు ప్రధాన హామీలు ప్రకటించారు.
విద్య, వైద్యం ఫ్రీ
కవిత ప్రధానంగా ఇచ్చిన ఐదు హామీల్లో కీలకమైనవి విద్య, వైద్యం ఉచితం. ప్రైవేటు స్కూళ్లలో కూడా ఉచిత విద్య అందిస్తామని కవిత ప్రకటించారు. అలాగే వైద్యం కూడా అన్ని చోట్ల ఫ్రీ చేస్తామనిహామీ ఇచ్చారు. యువతకు ఉపాధి కోసం రెండు లక్షల నుంచి ఇరవై కోట్ల వరకూ రుణాలు, సామాజిక న్యాయతెలంగాణ, రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తామన్నారు.
మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని సంచలన ప్రకటన చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, పార్టీ కమిటీల్లోనూ సగం పదవులు మహిళలకే ఇస్తామని హామీ ఇచ్చారు. చట్టసభల్లో మహిళా బిల్లు కోసం తాను చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, తన పార్టీ ద్వారా దాన్ని ఆచరణలో చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా, సొంతంగా వ్యాపారాలు ప్రారంభించే ప్రతి యువకుడికి, యువతికి పూచీకత్తు లేని రుణాలు సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి ,కళలను కాపాడుకోవడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. విత అటు యువతను, ఇటు మహిళలను , గ్రామీణ ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం టీఆర్ఎస్
కవిత స్పీడ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దారి తప్పిందనందున ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా తాము వచ్చామని చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా తన తండ్రి కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీపై ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు ఆమె తన దారిని చాలా క్లారిటీగా ఎంచుకున్నారని స్పష్టం చేస్తోంది. తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది, సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైంది అంటూ వ్యాఖ్యానించిన ఆమె, గత పదేళ్ల పాలనలో జరిగిన కొన్ని పరిణామాలకు ఆ కుటుంబంలో భాగమైనందుకు బహిరంగంగా క్షమాపణలు కోరారు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయని భావిస్తే, రైతులకు సంకెళ్లు పడటం, దళితులపై దాడులు జరగడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకుపోయిందని, ఫోన్ ట్యాపింగ్ వంటి చర్యల వల్ల ప్రజలు దారుణమైన నిఘా నీడలో బతకాల్సిన పరిస్థితి వచ్చిందని కవిత మండిపడ్డారు. మనం కలలుగన్న తెలంగాణ ఇది కాదని, కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేసిందని ఆమె తేల్చి చెప్పారు. అప్పుడున్న కేసీఆర్ వేరు, ఇప్పుడున్న కేసీఆర్ వేరు.. ఇప్పుడు ఆయన కేవలం ఒక మరమనిషి లా మారిపోయారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇక సెంటిమెంట్లు ఉండవని తేల్చి చెప్పేసినట్లయింది. పార్టీని నమ్ముకున్న తనలాంటి వారిని అవినీతి పేరుతో పక్కన పెట్టి, పార్టీని దోచుకునే పందికొక్కుల్ని కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. తన ప్రసంగం పొడవునా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తాము ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించడానికే కవిత ప్రాధాన్యత ఇచ్చారు. బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించిందని, అందుకే మళ్లీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలంగాణ రాష్ట్ర సేన అవసరమని ఆమె పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణే తన పార్టీ లక్ష్యమని చెబుతూ.. పాత తప్పులను దిద్దుకుని కొత్త బాటలో పయనిస్తానని ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ ప్రబుత్వంపైనా విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డిని కర్కోటకుడిగా కవిత విమర్శించారు. సీఎం ను అలా అనకూడదని కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే విమర్శించాల్సి వస్తోందన్నారు. రేవంత్ పాలనలో తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కేవలం అబద్ధాల పునాదుల మీద నిర్మించబడ్డాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించి కేవలం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒకవైపు అభివృద్ధి అని చెబుతూనే, మరోవైపు తెలంగాణ ప్రజలపై అదనపు భారాలు వేస్తున్నారని, పాలనలో పారదర్శకత కరువైందని ధ్వజమెత్తారు. బీజేపీ చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మలా మారిపోయారని, ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.
తెలంగాణకు అమ్మగా మారుతా!
కవిత తన ప్రసంగాన్ని ముగిస్తూ అత్యంత భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని మూడున్నర కోట్ల మంది ప్రజలకు ఒక రాజకీయ నాయకురాలిగా కంటే, ఒక అమ్మగా పరిణతి చెందాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. బిడ్డలకు కష్టాలు వస్తే అమ్మ హృదయం ఏ విధంగానైతే బద్దలవుతుందో, తెలంగాణ ప్రజల కష్టాలు చూసి నా మనసు కూడా అలాగే విలవిలలాడుతోంది. పాలనలో అమ్మతనం ఉన్నప్పుడే ప్రజల కష్టాలు తీరుతాయి, రాష్ట్రం నిజమైన అభివృద్ధి పథంలో పయనిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ పార్టీ తన ప్రాథమిక లక్ష్యాన్ని విస్మరించి, తెలంగాణ ఆత్మను కోల్పోవడం వల్లే.. ఆ లోటును పూడ్చేందుకు, ప్రజలకు అండగా నిలిచేందుకు ఈ తెలంగాణ రాష్ట్ర సేనఆవిర్భవించిందని కవిత స్పష్టం చేశారు. ఒక తల్లిలాంటి ప్రేమతో, పోరాట పటిమతో రాష్ట్రాన్ని కాపాడుకుంటానన్నారు.
ఎలా చూసినా కవిత రాజకీయం చాలా పక్కా ప్రణాళికతో పకడ్బందీగా సాగుతోంది. ముందుగా తన పార్టీకి స్పేస్ సృష్టించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కన్నా.,తన టీఆర్ఎస్ పార్టీనే అసలైన తెలంగాణ పార్టీ అని ప్రజలకు సంకేతాలు పంపారు. కవిత నుంచి తనను తాను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ చాలా కష్టాలు పడాల్సిందే. ఎందుకంటే.. కవిత ..కేసీఆర్కు అప్ డేటెడ్ వెర్షన్ రాజకీయం చేస్తున్నారు.
